హర్యానా : హర్యానాలోని జింద్ నుండి భారతదేశపు మొట్ట మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును శుక్రవారం మోదీ ప్రారంభించారు. జింద్, సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు రెండు గంటల్లో పూర్తి చేస్తుంది, ఈ ప్రయాణంలో 12 మధ్యంతర స్టేషన్లలో ఆగుతుంది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుండి సోనిపట్‌ను కలిపే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దీనితో, హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న దేశాల సరసన భారతదేశం చేరింది . రైల్వే రంగంలో స్వచ్ఛమైన, సుస్థిర రవాణా విధానాన్ని అవలంబించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా భావించాల్సి ఉంటుందన్నారు పీఎం మోదీ. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, హర్యానా గవర్నర్ అశిమ్ కుమార్ ఘోష్ , ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తదితరులు జింద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనేక మంది పాఠశాల విద్యార్థులతో కూడిన ఆ రైలు జింద్ రైల్వే స్టేషన్ నుండి కదలడం ప్రారంభించగా ప్రధాన మంత్రి వారికి అభివాదం చేశారు. భారతదేశంలోనే రూపకల్పన , తయారీ జరిగిన ఈ రైలు, స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయడం విశేషం. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్‌లో దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. ఆకర్షణీయమైన ఆకాశ నీలం, తెలుపు రంగుల కలయికతో రూపొందించబడిన ఈ రైలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో నడుస్తుంది. ఇది హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మార్చి రైలును ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రక్రియలో ఉప-ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది, తద్వారా రైలు నడిచేటప్పుడు కార్బన్ ఉద్గారాలు ఏమాత్రం ఉండవు. డీజిల్ రైళ్లతో పోలిస్తే, ఇవి హానికరమైన ఉద్గారాలను తొలగిస్తాయి.
