2020 అమెరికా ఎన్నిక‌ల్లో చైనా జోక్యం చేసుకుంది

సంచ‌ల‌న ఆరోప‌ణలు చేసిన అమెరికా చీఫ్ ట్రంప్

hellotelugu-Trump

అమెరికా : చైనాపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 2020 వ సంవ‌త్స‌రంలో అమెరికాలో జ‌రిగిన‌ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంద‌ని మండిప‌డ్డారు. ఇందుకు సంబంధించి త‌మ వ‌ద్ద ఆధారాలు కూడా ఉన్నాయ‌ని, అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో వాటిని బ‌య‌ట పెడ‌తామ‌ని బాంబు పేల్చారు. ఆనాడు జో బైడెన్ చేతిలో తన ఓటమిని ప్రస్తావిస్తూ దొంగిలించబడిన ఎన్నికలను మనం ఇక ఎప్పటికీ చూస్తూ ఊరుకోలేం అని ట్రంప్ అన్నారు. సీఐఏ నివేదికను ఉటంకిస్తూ, తనకు వ్యతిరేకంగా ఉన్న దేశీయ , విదేశీ శక్తులను ఉపయోగించుకుని, 2018 మధ్యంతర ఎన్నికలు, 2020 అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నించిందని ట్రంప్ ఆరోపించారు.

అమెరికా నిఘా సంస్థలలోని “డీప్ స్టేట్” (అధికార యంత్రాంగంలోని అంతర్గత వర్గాలు) సభ్యులు 2020 ఎన్నికల్లో చైనా జోక్యం గురించిన సమాచారాన్ని దాచి ఉంచారంటూ ట్రంప్ ఆరోపించారు; ఈ దాచిపెట్టిన వ్యవహారంపై దర్యాప్తును ప్రకటించారు. ఎన్నికల విశ్వసనీయతపై దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, చైనా ఎన్నికల జోక్యం గురించిన సమాచారాన్ని నిఘా అధికారులు ఉద్దేశ పూర్వకంగా దాచిపెట్టారని కొత్తగా విడుదలైన పత్రాలు వెల్లడిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ దుర్మార్గమైన చర్యకు తోడుగా, మేము విడుదల చేస్తున్న రెండవ సెట్ పత్రాలు ఒక విషయాన్ని బయట పెడుతున్నాయని అన్నారు. మన నిఘా సంస్థలలోని ‘డీప్ స్టేట్’ సభ్యులు చైనా కుట్రపూరిత ఎన్నికల జోక్యం స్థాయికి సంబంధించిన సమాచారాన్ని అణచి వేయడానికి, తక్కువ చేసి చూపడానికి చురుకుగా పనిచేశారని పేర్కొన్నారు. అంతే కాదు అమెరికా ప్రజలకు తెలియకుండా దానిని కప్పిపుచ్చారని బాంబు పేల్చారు.

Exit mobile version