అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం-వీజీఎఫ్ పాలసీ 1.0 ను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చకు పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వేర్వేరు విధానాలను కూడా అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల మేరకు ప్రతీ ఏటా పీపీపీ కింద రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలోని విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కింద వీటిని చేపట్టాల్సి రావొచ్చని సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం స్వర్ణాంధ్ర విజన్ మైక్రో, మ్యాక్రో లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టాలని అన్నారు.
ఎప్పటికప్పుడు లోటుపాట్లను సరిదిద్దుకుంటూ అవకాశాలను అందిపుచ్చు కోవాలని సూచించారు నారా చంద్రబాబు నాయుడు. భవిష్యత్తులో పరిశ్రమలకు సరఫరా చేసే నీటి ద్వారా జలవనరుల శాఖకు ఆదాయం వస్తుందని… సాగునీటి సంఘాలు కూడా ఈ ప్రక్రియలో కీలకంగా ఉంటాయన్నారు. ప్రతీ ప్రభుత్వ శాఖ ఫైనాన్షియల్ ప్లాన్ ను తయారు చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఆదాయ మార్గాలను నిర్దేశించు కోవాలన్నారు సీఎం. ప్రభుత్వ శాఖలు పెట్టుబడిదారుల నుంచి విశ్వాసాన్ని కలిగించేలా పీపీపీ ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. ఏ రంగమైనా ఏపీకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజి రావాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.
