హైదరాబాద్ : రోజు రోజుకు హైదరాబాద్ నగరం కాంక్రీటు అడవిగా మారుతున్న తరుణంలో ప్రజల కోసం కేటాయించిన పార్కులు, ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని పలువురు ‘హైడ్రా ప్రజావాణి’లో ఫిర్యాదు చేశారు. ప్రాణ వాయువును అందించే పార్కులను ఆక్రమించేస్తుండటంతో నగరవాసులకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా చోటు లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు వంటి ప్రజా వినియోగ స్థలాలు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయని, మున్సిపల్ కార్పొరేషన్లకు ‘గిఫ్ట్ డీడ్’ (బహుమతి పత్రం) ద్వారా అప్పగించిన స్థలాలు కూడా రక్షణకు నోచుకోవడం లేదని వారు పేర్కొన్నారు. పార్కుల అభివృద్ధికి నిధులు తక్కువగా ఉన్నప్పటికీ, ఆ స్థలాల చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించి, అవి పార్కు స్థలాలని తెలిపే బోర్డులను ఏర్పాటు చేస్తే, స్థానికులే స్వయంగా వాటిని కాపాడుకుంటారని, మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిస్తారని వారు చెప్పారు. లేఅవుట్లు రూపొందించినప్పుడు పార్కులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను స్పష్టంగా గుర్తించేలా బోర్డులు లేదా సరిహద్దులు ఏర్పాటు చేయక పోవడం వల్లే ఈ ఆక్రమణలు జరుగుతున్నాయని పలువురు వాపోయారు.
హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజావాణికి పార్కులు, ప్రజా వినియోగ స్థలాలు, చెరువులు, నీటి కాలువల పరిరక్షణ కోరుతూ మొత్తం 51 ఫిర్యాదులు అందాయి. హైడ్రా అదనపు కమిషనర్ డి. ఆనంద్ కుమార్ వీటిని పరిశీలించి, సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలను అప్పగించారు. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం కొత్తపేటలోని మారుతి నగర్లో సుమారు 600 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ ప్రజా వినియోగం కోసం 667 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఈ స్థలం ఆక్రమణకు గురవుతోంది. ఆక్రమణదారులు అక్కడ గదిని నిర్మించడానికి పలుమార్లు ప్రయత్నించగా, ‘మారుతి నగర్ డెవలప్మెంట్ సొసైటీ’ ప్రతినిధులు వారిని అడ్డుకున్నారు. ఈ స్థలాన్ని కాపాడాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిని కోరారు. అలాగే ఇది ప్రజా వినియోగ స్థలమని తెలిపే బోర్డులను అక్కడ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం పరిధిలోని ‘కొమిటి కుంట’ చెరువులో కొందరు వ్యక్తులు మట్టిని పోస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. చెరువు పక్కన ఉన్న 50 అడుగుల రోడ్డు వెంబడి ఆక్రమణలు జరుగుతున్నాయని, దానివల్ల రోడ్డు 30 అడుగులకు తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని చెరువు , రోడ్డు రెండింటిపై ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మియాపూర్‌లోని ప్రశాంత్ నగర్ కాలనీలో ప్రజల ఉపయోగం కోసం ఉద్దేశించిన ఖాళీ స్థలాలను, పార్కులను హైడ్రా పరిరక్షించింది. అయితే, మరో ఖాళీ స్థలంలో ఒక నిర్మాణం అలాగే ఉంది. కొంతమంది మాజీ సంక్షేమ సంఘం ప్రతినిధులు దానిని కార్యాలయంగా వాడుకుంటున్నారు. ఈ వ్యక్తులు ఖాళీ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆ కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ఆ స్థలానికి పూర్తిగా కంచె వేసి, అనధికార నిర్మాణాన్ని తొలగించాలని ప్రశాంత్ నగర్ క్రమబద్ధీకరణ సమన్వయ కమిటీ ప్రజావణికి విజ్ఞప్తి చేసింది.
సర్వే నెం. 338లో రోడ్లు, పార్కు స్థలాలను ఆక్రమిస్తూ ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారని తుర్కయంజల్ మున్సిపాలిటీ నుంచి ఒక ఫిర్యాదు అందింది. మున్సిపల్ అధికారులు గతంలో ఆ స్థలాన్ని తనిఖీ చేసి గోడలను తొలగించినప్పటికీ, అదే ప్రాంతంలో మళ్లీ నిర్మాణం జరుగుతోందని అందులో పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి రాకపోకలు సాగించే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, రోడ్లు, పార్కు స్థలాలను సర్వే చేసి, ఆక్రమణలను తొలగించాలని అభ్యర్థించారు. రాజేంద్రనగర్ మండలం మైలార్దేవపల్లి గ్రామంలోని శాస్త్రిపురం హౌసింగ్ కాలనీలో సుమారు 6,500 చదరపు గజాల ఆట స్థలాన్ని హైడ్రా పరిరక్షించింది. అది మళ్లీ ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ స్థలాన్ని పరిరక్షించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, కొందరు వ్యక్తులు జేసీబీ తో దాన్ని చదును చేస్తున్నారని, బోర్వెల్ తవ్వేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. ఆ స్థలాన్ని వెంటనే తనిఖీ చేసి, ఆట స్థలాన్ని ఆక్రమణల నుంచి రక్షించాలని వారు అభ్యర్థించారు.
సెరిలింగంపల్లి మండలం, హఫీజ్‌పేటలోని కొత్తకుంట చెరువును పెద్ద వాణిజ్య సముదాయాల నిర్మాణం కోసం ఆక్రమిస్తున్నారని, చెరువు ఉన్న సర్వే నెం. 100లో ఆక్రమణలను సమర్థించు కోవడానికి సర్వే నెం. 99ని కారణంగా చూపుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. అక్కడ ఒక కార్ గ్యారేజీని నిర్వహిస్తూ పరిసర ప్రాంతాలకు హాని కలిగిస్తున్నారని పేర్కొన్నారు .
