ములుగు జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. ఆయన నిర్వాకం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ గతి పట్టిందన్నారు. తాము వచ్చాక రైతులకు నీళ్లు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు నీటి పారుదల రంగానికి చెందిన ఉన్నతాదికారులతో కలిసి దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో నిపుణులు , ఇంజనీర్ల సలహాలను విస్మరించి, సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం వల్లనే గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరం బ్యారేజీలు కేవలం మూడేళ్లలోనే దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మల్లు భట్టి విక్రమార్క. ప్రజల కష్టార్జితంతో నిర్మించిన ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా నిర్వహించడం, ఆ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం బాధాకరం అన్నారు డిప్యూటీ సీఎం.
జె. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టును పరిశీలించి, అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, నిర్వహణ కోసం తక్షణమే రూ. 146 కోట్లను విడుదల చేయాలని ఆదేశించామన్నారు భట్టి విక్రమార్క. తమ ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్నీ కేవలం నిపుణుల సాంకేతిక సలహాల ఆధారంగానే తీసుకుంటుందని స్పష్టం చేశారు. దేవాదుల, సీతారామ , డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల వంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. గోదావరి జలాలను పూర్తిగా వినియోగించు కోవడం, అలాగే రైతులకు శాశ్వత సాగునీటి భద్రతను, ప్రజలకు తాగునీటి భద్రతను కల్పించడం తమ ప్రభుత్వ సంకల్పం అని స్పష్టం చేశారు.
