హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణదారుల గుండెల్లో భయం కల్పించేలా చేస్తోంది. చాలా చోట్ల ఆక్రమణలకు గురైనట్లు గుర్తించింది. ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గంలోని రామాంతాపూర్ పెద్ద చెరువు వద్ద ఉన్న ఆక్రమణలను హైడ్రా తొలగించింది. రామాంతాపూర్ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ (పూర్తి స్థాయి నీటి మట్టం) పరిధి 30 ఎకరాలు కాగా, అందులో 16 ఎకరాల వరకు ఆక్రమణకు గురైందని గుర్తించింది హైడ్రా. ఇందులో 12 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. తాత్కాలిక షెడ్లు , గుడిసెల్లో నివసిస్తున్న మరో 4 ఎకరాల పరిధిలోని వారికి, వారిని నిరాశ్రయులను చేయకుండా ఉండేందుకు ‘డబుల్ బెడ్‌రూమ్’ ఇళ్లను మంజూరు చేయాలని HYDRA సిఫార్సు చేసింది.
చెరువుకు సంబంధించిన మొత్తం 18 ఎకరాల అభివృద్ధి ప్రక్రియలో భాగంగా 1900 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న వాణిజ్య భవనం (G+2) , 280 చదరపు గజాల విస్తీర్ణంలోని ఆటో గ్యారేజీని కూడా హైడ్రా తొలగించింది. వర్షాకాలంలో చెరువు నిండినప్పుడు ఆ గుడిసెలు నీట మునిగి పోయేవి, దాంతో అక్కడి నివాసితులు ప్రతి ఏటా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వ్యర్థాల సేకరణ , దినసరి కూలీ పనుల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని హైడ్రా సిఫార్సుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇళ్ల కేటాయింపుల్లో వీరికి ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు చేపట్టింది. సుమారు రూ. 19 కోట్ల వ్యయంతో రామాంతాపూర్ పెద్ద చెరువును అభివృద్ధి చేసే క్రమంలో, ఎఫ్ టిఎల్ విస్తరణ పనులకు ఉన్న అడ్డంకులు తొలగి పోయాయి. ఈ ఆక్రమణల తొలగింపు రామాంతాపూర్ చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి , మెరుగు పరచడానికి ఎంతగానో ఉపయోగ పడుతుందని హైడ్రా స్పష్టం చేసింది.
