అమరావతి : గడచిన రెండేళ్లుగా సమిష్టిగా పనిచేసామని సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు అర్థం చెప్పాం అని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. 2019-2024 మధ్య వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన చెందారు. రాష్ట్రంలో ఆ 5 ఏళ్లూ విధ్వంసం జరిగిందని ఆరోపించారు. కానీ కూటమి సర్కార్ వచ్చాక సీన్ మారిందన్నారు. ప్రభుత్వ ఆలోచనల్ని ప్రభుత్వ యంత్రాంగం సమర్ధంగా అమలు చేస్తోందని ప్రశంసలు కురిపించారు. ఆశించిన మార్పుల్ని కొంతవరకు సాధించగలిగాం. మరిన్ని రంగాల్లో మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ప్రతీ ప్రభుత్వ శాఖ ఎప్పటికప్పుడు తాము సాధించిన ఫలితాలను బేరీజు వేసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రతీ మూడు నెలలకూ ఒకసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించటంతో పాటు జీఎస్డీపీని విశ్లేషించు కుంటున్నాం అని తెలిపారు సీఎం. 2047 వికసిత్ భారత్ బాటలోనే స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశాం అని చెప్పారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం అని తెలిపారు. ఇప్పటివరకు 19 ఎస్ఐపీబీ సమావేశాలు, 57 కేబినెట్ సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు సీఎం. గత పాలనలో ఏపీపై పారిశ్రామిక వేత్తలకు నమ్మకం పోయిందన్నారు. కానీ ఆ పరిస్థితిని పునరుద్ధరించాం. మళ్లీ ఏపీ మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా అవతరించిందని ప్రకటించారు. మళ్లీ పెద్దఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. తద్వారా ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
