ఢిల్లీ : బాలీవుడ్ నటి, భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ కంగనా రనౌత్ హాట్ టాపిక్ గా మారారు. పార్లమెంట్ సాక్షిగా ఆమె కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని ఏకి పారేశారు. తనదైన స్టైల్ లో విరుచుకు పడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి బరిలోకి దిగారు . భారీ విజయాన్ని నమోదు చేశారు. అందరినీ విస్తు పోయేలా చేశారు. నటిగానే కాకుండా ఆమె తరుచూ వార్తల్లో ఉంటూ వచ్చారు. ప్రధానంగా ఆమె హిందూ వాయిస్ ను వినిపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. తన స్వంత ఊరరు భంబ్లా. మార్చి 23, 1987లో పుట్టారు. తన వయసు 38 ఏళ్లు. తను ప్రస్తుతం బాలీవుడ్ లో అతి ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరుగా ఉన్నారు.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలోనూ, ఫ్యాషన్ గా ఉండే నటిగానూ మీడియాలో ఎక్కువ ప్రసిద్ధమయ్యారు కంగనా రనౌత్. ఆమె ఇప్పటివరకూ మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. పేరెంట్స్ తనను డాక్టర్ గా చూడాలని అనుకున్నారు. కానీ ఆమె అనుకోకుండా నటిగా మారారు. ఆ తర్వాత రాజకీయ నాయకురాలిగా అవతారం ఎత్తారు. తన 16వ ఏట తన కెరీర్ తానే నిర్మించు కోవాలనే సంకల్పంతో ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆ తరువాత కొన్నాళ్ళకు మోడల్ అయ్యారు కంగనా రనౌత్. నాటక దర్శకుడు అరవింద్ గౌర్ శిక్షణలో నటన నేర్చుకున్న ఆమె 2006లో గాంగ్ స్టర్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో నటనకు గాను అవార్డు అందుకున్నారు. వోహ్ లమ్హే (2006), లైఫ్ ఇన్ ఎ.. మెట్రో (2007), ఫ్యాషన్ (2008) సినిమాల్లోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కంగనా రనౌత్.
