అమరావతి : జెన్ జి యువత ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ కూడా మారాల్సి ఉందన్నారు ఆ పార్టీ చీఫ్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరు కావాలని కులం, మతం, ప్రాంతంతో ముడి పెడుతున్నారని ఆరోపించారు. సమకాలీన రాజకీయాల్లో రాజ్యాంగానికి కట్టుబడి, అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ, దేశ సమగ్రతకు భంగం కలగకుండా వ్యవహరిస్తామని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ప్రమాణం చేస్తారు. అయితే వాస్తవ రాజకీయాల్లో కొందరు వ్యక్తుల తప్పులను వారి వ్యక్తిగత చర్యలుగా కాకుండా, వారు చెందిన కులం, మతం లేదా వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు పవన్ కళ్యాణ్. ఇది సమాజంలో విద్వేషాలకు కారణం అవుతోంది. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొందరు కులం, మతం, ప్రాంతీయత వంటి భావావేశాల ముసుగు వేసుకుని దాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటువంటి రాజకీయ సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న వాస్తవాన్ని గుర్తెరగడం లేదన్నారు పవన్ కళ్యాణ్. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప, సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తోందని అన్నారు. జనసేన పార్టీ రాజకీయ సామాజిక బాధ్యతతో సేనా గళం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన సభ్యులు ఉంటారు. ఎవరైనా వ్యక్తి చేసిన తప్పు, అనుచిత వ్యాఖ్యలు లేదా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యలపై స్పందించాల్సిన సందర్భంలో, ఆయా కులాలు లేదా వర్గాల వారిని ముందుకు తీసుకు రాకుండా, కమిటీ సభ్యులే బాధ్యతాయుతంగా స్పందించి పార్టీ వైఖరిని ప్రజలకు తెలియ జేస్తారని అన్నారు. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ ముఖ్యంగా జెన్ జీ యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం అన్నారు పవన్ కళ్యాణ్.
