అమరావతి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు శాసన మండలి సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే శాసన సభలో ఆ పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇక ఎమ్మెల్సీల పరంగా ఏకంగా ఆరుగురు గుడ్ బై చెప్పాలని అనుకోవడం పార్టీ వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే పార్టీ పరంగా జగన్ కు అనుంగు అనుచరుడిగా, నెంబర్ 2గా ఉన్న ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా తప్పుకున్నాడు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆపై తాను పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు.
తాజాగా వైసీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు (శాసన మండలి సభ్యులు) తాము ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్ లో ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజును కలిశారు. తమ రాజీనామాలను ఆమోదించాలంటూ కోరారు . ఇదిలా ఉండగా చైర్మన్ రాజును కలిసిన వారిలో కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, జకియా ఖానం, పోతుల సునీత ఉన్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు ఈ సందర్బంగా. ఒక్కొక్కరిని పిలిచి విడివిడిగా మాట్లాడుతున్నారు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు.
