హైదరాబాద్ : రాష్ట్రంలో భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి భూ సర్వేయే ఏకైక మార్గమని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గ దర్శకత్వంలో భూములకు సంబంధించిన కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఇప్పటికే పరిష్కరించ బడ్డాయని, మరికొన్నింటికి త్వరలోనే పరిష్కారాలు లభిస్తాయని తెలిపారు. గత ప్రభుత్వం పరిమిత దృక్పథంతో వ్యవహరించగా, తాము ప్రజల కోణం నుండి ఆలోచిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. భూ భారతి’ చట్టంలో హామీ ఇచ్చినట్లుగా, ప్రతి భూ భాగానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, జియో-కోఆర్డినేట్లతో కూడిన మ్యాప్ , ఎల్‌పిఎం నంబర్‌ను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
వనపర్తిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ , గృహనిర్మాణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి తన సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు , వాకిటి శ్రీహరిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ‘ధరణి’ చట్టం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలను ప్రస్తావిస్తూ, ‘భూ భారతి’ పోర్టల్‌లో పేర్కొన్న విధంగా ‘భూధార్’ కార్డులను అందించే లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం సర్వే కార్యక్రమాన్ని చేపడుతోందని వెల్లడించారు. ‘భూ భారతి’లో భాగంగా మొదటి దశలో సర్వే కోసం 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశామని తెలిపారు. అలాగే మ్యాప్‌లు అందుబాటులో లేని రాష్ట్రంలోని మరో 413 రెవెన్యూ గ్రామాల్లో దశల వారీగా సర్వే నిర్వహించే కార్యక్రమం కొనసాగుతోందని వెల్లడించారు.
భూ సర్వే ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున అత్యాధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చుకుందని తెలిపారు. మొదటి దశలో కొనుగోలు చేసిన రోవర్లకు అదనంగా, రెండవ దశ కోసం కూడా మరిన్ని రోవర్లను సమకూర్చుకున్నామని, అవసరాలకు అనుగుణంగా వాటిని జిల్లా వారీగా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి వేలాది మంది సర్వేయర్లకు లైసెన్సులు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ ప్రచారాలను పట్టించు కోవద్దని, రైతులకు శాశ్వత ప్రయోజనాలను చేకూర్చే ఈ ప్రభుత్వ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సర్వేయర్లను కోరారు.
సాగులో ఉన్నప్పటికీ సరైన యాజమాన్య పత్రాలు లేకపోవడం వల్ల దశాబ్దాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల సమస్యలను గుర్తించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పేర్లలో వ్యత్యాసాలు, భూమి సరిహద్దు వివాదాలు, పాత రికార్డులలో లోపాలు, అనధికారిక ఆస్తుల వివరాల వంటి గ్రామీణ ప్రాంత సమస్యలకు సమగ్ర సర్వే శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రికార్డులు , మ్యాప్‌లను అప్‌డేట్ చేయడమే ‘భూమి భారతి’ లక్ష్యమని పేర్కొన్నారు.
