చెన్నై : డైనమిక్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం రాకా. దీనిని భారీ ప్రాజెక్టుతో నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. ఈ సినిమాపై రోజు రోజుకు ఉత్కంఠ పెంచేలా చేస్తూ వస్తున్నారు దర్శకుడు. ఇందులో కీ రోల్ పోసిస్తున్నాడు అల్లు అర్జున్. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ‘రాకా’ చిత్రంపై దర్శకుడు సిబి చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలోని దృశ్యాల (విజువల్స్) గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఈ ప్రాజెక్ట్ పట్ల ఉన్న ఆసక్తిని మరింత పెంచాయి. అట్లీతో సన్నిహిత సంబంధం ఉన్న సిబి, ఇటీవల ‘రాకా’కు సంబంధించిన కొంత దృశ్య భాగాన్ని (ఫుటేజ్) చూశారు. ఆ సినిమా స్థాయి , దృశ్య నాణ్యత తనపై బలమైన ముద్ర వేసిందని ఆయన పేర్కొన్నారు.
‘రాకా’ విజువల్స్‌ను ‘అవతార్’తో పోల్చారు సీబీ చక్రవర్తి. ఇంతటి భారీ స్థాయి విజువల్స్‌ను తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని అన్నాడు. ఆ అనుభవాన్ని హాలీవుడ్ చిత్రం ‘అవతార్’తో పోల్చారు. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అట్లీ ప్రాజెక్ట్ పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు అంచనాలను మరింత పెంచాయి. అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమాకు ఈ చిత్రం గుర్తింపు తెస్తుందని కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక అద్భుత దృశ్యకావ్యంతో పోల్చడం సహజంగానే సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలను రేకెత్తించింది.
సిబి తెలిపిన వివరాల ప్రకారం, అట్లీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 21న ప్రేక్షకులు ‘రాకా’కు సంబంధించిన మొదటి దృశ్యాలను (గ్లింప్స్) చూసే అవకాశం ఉంది. ఈ గ్లింప్స్ సుమారు 3.7 నిమిషాల నిడివి ఉండవచ్చని సమాచారం. ఈ ప్రకటన అల్లు అర్జున్, అట్లీ అభిమానులలో భారీ ఆసక్తిని కలిగించింది. వారు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ , అట్లీ కలయిక కారణంగా ‘రాకా’ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కథ నేపథ్యానికి సంబంధించిన వివరాలు ఇంకా పరిమితంగానే ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయి ఇప్పటికే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలి కాలంలో, అనేక భారీ చిత్రాలు తమ ప్రచార సామగ్రి దృశ్య వైభవం గురించిన ప్రకటనల ద్వారా విడుదలక ముందే భారీ ఉత్సాహాన్ని సృష్టించాయి. అయితే, చివరికి ప్రేక్షకులు తెరపై చూసే అంశాలే ఆ సినిమా ఫలితాన్ని నిర్ణయిస్తాయి.
