హైదరాబాద్ : కేవలం దొంగతనాలే కాకుండా ఆహార కల్తీ, రియల్ ఎస్టేట్ మోసాలు, బెట్టింగ్, స్మగ్లింగ్ వంటి వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు నూతన డీజీపీ సీవీ ఆనంద్. శాఖ పునర్వ్యవస్థీకరణపై స్పందిస్తూ.. గతంలో నక్సల్స్ నియంత్రణ కోసం గ్రే హౌండ్స్ , ఎస్ఐబి విభాగాలను ఏర్పాటు చేసి కేటాయించిన సిబ్బందిని ప్రస్తుతం అవసరమైన సైబర్, నార్కోటిక్స్ విభాగాలకు బదిలీ చేస్తామన్నారు. అలాగే సుమారు 19 వేల పోలీస్ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీవీ ఆనంద్. అందులో ఇప్పటికే 5 వేల నియామకాలకు ఆమోదం లభించిందని తెలిపారు. ఏసీబీ, సీఐడీ వంటి కీలక విభాగాలకు పూర్వవైభవం తీసుకు రావడంతో పాటు, వివిధ ప్రభుత్వ విభాగాలతో పోలీస్ పరిధిని అనుసంధానించి సమన్వయం పెంచుతామన్నారు.
సాంకేతికత వినియోగంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, డ్రోన్ల వినియోగాన్ని పెంచుతామన్నారు డీజీపీ సీవీ ఆనంద్. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ సింక్రనైజేషన్ కోసం గూగుల్ వంటి సంస్థల సహకారం తీసుకుంటామని, విపత్తు సమయాల్లో హైడ్రా, ఫైర్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ‘ఫస్ట్ రెస్పాండర్’గా పని చేసేలా సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాడై పోయిన సీసీ కెమెరాల మరమ్మతుల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్నారు. దర్యాప్తులో సాంకేతిక లోపాల వల్ల నేరస్తులు తప్పించు కోకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డాక్యుమెంటేషన్‌ను పక్కాగా చేస్తామన్నారు. రాష్ట్రంలో నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకు పోయిందన్నారు.


















