అమరావతి : నెల్లూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి కోసం త్వరగా టెండర్లు పిలవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కేంద్రంలోని మోదీ సర్కార్ ను. సంబంధిత అధికారులు స్థలాలను పరిశీలించారని, అవి ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించారని ఎంపీ తెలిపారు. నెల్లూరులో ప్రతిపాదిత 100 పడకల ‘ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్స (ఈఎస్ఐ) ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి, పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ఈ సందర్బంగా ఎంపీ కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాకు లేఖ రాశారు. ఆసుపత్రి , సిబ్బంది నివాస గృహాల (క్వార్టర్స్) నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించేలా సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని ఆయన అభ్యర్థించారు.
జిల్లా కేంద్రంలో ఆసుపత్రి కోసం అనువైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించామని, సిబ్బంది నివాస గృహాల కోసం ప్రత్యేకంగా ఒక ఎకరం స్థలాన్ని కేటాయించామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులు స్థలాలను పరిశీలించి, అవి ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత ఆసుపత్రి కార్మికులకు, వారి కుటుంబాలకు, ముఖ్యంగా జిల్లాలోని భారీ కార్మిక వర్గానికి మెరుగైన వైద్య సేవలను అందిస్తుందని ఎంపీ చెప్పారు. ESI ఆసుపత్రి ఏర్పాటు వల్ల బీమా సౌకర్యం కలిగిన కార్మికులు , వారిపై ఆధారపడిన వారికి వైద్య సేవలు , సంక్షేమ మద్దతు మరింత బలపడుతుందని ఆయన అన్నారు. భూమి గుర్తింపు మరియు స్థల పరిశీలన ప్రక్రియలు ఇప్పటికే పూర్తయ్యాయని పేర్కొన్న ప్రభాకర్ రెడ్డి, వీలైనంత త్వరగా టెండర్లు పిలవడం ద్వారా ఈ ప్రాజెక్టును అమలు దశకు తీసుకు వెళ్లాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
