ముంబై : భారత దేశానికి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కు అమెరికా కీలకమైన బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా కీలక ఫెడరల్ బాధ్యత కోసం రఘురామ్ రాజన్‌ను ఎంపిక చేసింది. ఫెడరల్ రిజర్వ్ నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగా ఉన్న వడ్డీ రేట్ల సమస్యను పరిష్కరించడం రాజన్ ముందున్న మొదటి ప్రధాన సవాలుగా భావిస్తున్నారు. భారతీయ మూలాలున్న నిపుణులు రాజ్ చెట్టి , ఆశా శర్మలతో పాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ను కూడా అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త కార్యక్రమంలో కీలక బాధ్యతను చేపట్టనున్నారు. చెట్టి ఢిల్లీలో జన్మించిన అమెరికన్ ఆర్థికవేత్త కాగా, శర్మ మైక్రోసాఫ్ట్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. వీరు చేపట్టబోయే నిర్దిష్ట బాధ్యతల గురించి ఫెడరల్ రిజర్వ్ ఇంకా వెల్లడించనప్పటికీ, ద్రవ్యోల్బణ సమస్యతో సతమతమవుతున్న దేశంలో ద్రవ్య విధానాన్ని పునర్నిర్మించగల కొత్త దృక్పథాలను తీసుకు రావడమే ఈ చర్య యొక్క ఉద్దేశ్యం.
కొత్త ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ కెవిన్ వార్ష్ ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు టాస్క్ ఫోర్స్‌ల ఏర్పాటును ప్రకటించారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాజీ గవర్నర్ మెర్విన్ కింగ్, వాల్‌మార్ట్ మాజీ సీఈఓ డగ్ మెక్‌మిల్లన్, నోబెల్ గ్రహీత థామస్ సార్జెంట్ , సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ కూడా ఈ టాస్క్ ఫోర్స్‌లలో సభ్యులుగా ఉన్నారు. ఒక సంస్థగా మా పనితీరును మెరుగు పరచుకోవడానికి వివిధ రంగాలకు చెందిన అత్యుత్తమ మేధావులు మాతో కలిసి పని చేయడానికి అంగీకరించడం నాకు గౌరవంగా ఉందన్నారు. దీని లక్ష్యం చాలా స్పష్టమైనది. ఈ కీలక సమయంలో మా లక్ష్యాలను సాధించడానికి ఫెడరల్ ను అత్యుత్తమ స్థితిలో ఉండేలా చూడటం అని వార్ష్ ప్రకటించారు.
