విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి చొరవ

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-APGoovt

అమ‌రావ‌తి : ప్రతి నెలా మొదటి తేదీని ‘పేదల సేవలో’ కార్యక్రమం ద్వారా సంక్షేమానికి కేటాయించామని సీఎం చంద్ర‌బాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. అదే విధంగా ప్రతి నెలా 9న ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని సూచించారు. మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమంతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నాలుగో శనివారం పౌరుల ఆరోగ్య నిర్వహణ కోసం డిజిటల్‌ హెల్త్‌ రికార్డుల ‘సంజీవని’ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. వీటితో పాటు మంచి ఆలోచనలు, విలువలతో కూడిన సమాజ నిర్మాణం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మహిళలు, శిశువుల్లో రక్తహీనత వంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని, ఇదే 2047 విజన్‌లో కీలక లక్ష్యమని చెప్పారు. వక్ఫ్‌ ఆస్తుల ద్వారా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న కాపు కార్పొరేషన్‌ భవనాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లాలో యానాటి కొండ సామాజిక వర్గాన్ని ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్‌ను కలెక్టర్ల కాన్ఫరెన్సులో మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. చాలా కాలంగా యానాటి కొండ సామాజిక వర్గం వాళ్లు తమను ఎస్టీల్లో చేర్చాలని కోరుతున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం…ఎస్టీల్లో చేర్చే అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈలోగా ఎస్టీలకు వర్తింపచేసే ప్రయోజనాలను యానాటి కొండ సామాజిక వర్గానికి అందించాలని ఆదేశించారు. బుడగ జంగాల తరహాలో యానాటి కొండ సామాజిక వర్గానికి లబ్ది చేకూర్చాలన్నారు సీఎం. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు హజరయ్యారు.

Exit mobile version