సమర్థ వంతమైన పాలనకు జెన్ జెడ్ మనస్తత్వమే కీలకం

ఐఐఎం రోహ్‌తక్ డైరెక్టర్ ఎం.డి. ఇలియాస్ కామెంట్స్

hellotelugu-GoodGoevernece

విజ‌య‌వాడ : అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో జెన్ జెడ్ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, అధికారులలో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడం ప్రధానాంశంగా నిలిచాయి. కలెక్టర్ల సమావేశాల చరిత్రలో తొలిసారిగా పరిపాలనలో నాయకత్వంపై ఇక్కడ ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఐఐఎం-రోహ్‌తక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ధీరజ్ శర్మ మాట్లాడుతూ ఉద్యోగ రంగంలోకి ప్రవేశిస్తున్న యువతరం గత తరాల కంటే గణనీయంగా భిన్నంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ప్రస్తావించారు. ఫలిత-ఆధారిత పరిపాలన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఆయన ‘నాయకత్వం’ గురించి 37 సార్లు, ‘ఫలితాలు సాధించడం’ గురించి 17 సార్లు ఉద్ఘాటించారని ప్రొఫెసర్ శర్మ అన్నారు. 1997 నుండి 2013 మధ్య జన్మించిన జెన్ జెడ్ కేవలం జీతం లేదా ఉద్యోగ భద్రతతో ప్రేరేపించ బడరని ఆయన అన్నారు.

క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా తమ మొదటి ఉద్యోగాలు పొందిన వారిలో 72 శాతం మంది ఒక సంవత్సరంలోపే ఉద్యోగాలు మానేస్తున్నారని ఐఐఎం అధ్యయనాలు చూపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలలో , ప్రతి 10 మంది నియామకాలలో ఏడుగురికి ప్రత్యామ్నాయ ఆఫర్లు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. వారు నైపుణ్యాభివృద్ధి, కెరీర్ వృద్ధి, కార్యాలయ వాతావరణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు . అసంతృప్తిగా ఉంటే వెంటనే ఉద్యోగాలు మారతారు. కొత్త తరం వారు కార్యాలయ సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడతారని, వాటిని తమ సీనియర్ల దృష్టికి తీసుకు వస్తారని ప్రొఫెసర్ శర్మ అన్నారు. వచ్చిన స్పందనతో అసంతృప్తిగా ఉంటే, తమ గళాన్ని వినిపించడానికి వారు బాహ్య వేదికలను, నెట్‌వర్క్ గ్రూపులను ఉపయోగిస్తారని ఆయన తెలిపారు.

అధికారులు జ్ఞానం, పనితీరు, నైపుణ్యం, ఆకట్టుకునే వ్యక్తిత్వం ద్వారా ఉద్యోగుల విశ్వాసాన్ని గెలుచు కోవాలని అన్నారు. అధికారిక అధికారం , నిజమైన ఆమోదం మధ్య తేడాను వివరించడానికి ఆయన అక్బర్ , బైరామ్ ఖాన్ ఉదాహరణను ఉదహరించారు. ఉద్యోగుల నుండి ఉత్తమ ఫలితాలను రాబట్టడానికి అధికారులు స్వయం ప్రతిపత్తి, నైపుణ్యం , లక్ష్యం అనే మూడు సూత్రాలను పాటించాలని ఐఐఎం-రోహ్‌తక్ డైరెక్టర్ అన్నారు. సిబ్బందికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఒక నిర్దిష్టమైన అవకాశం ఇవ్వాలన్నారు. అదే సమయంలో పర్యవేక్షణ , జవాబుదారీతనం కోసం సాంకేతికతను ఉపయోగించు కోవచ్చు. నిజమైన ప్రతిభావంతులను గుర్తించాలని, విచక్షణా రహితమైన అవార్డులు శ్రేష్ఠత విలువను తగ్గిస్తాయని ఆయన హెచ్చరించారు.

Exit mobile version