తుపాను వల్ల కలిగిన ప్రాథమిక నష్టం రూ. 4,600 కోట్లు

ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-ChandraBabuNaidu

అమ‌రావ‌తి : తుపాను వల్ల కలిగిన ప్రాథమిక నష్టం రూ. 4,600 కోట్లుగా అంచనా వేసిన‌ట్లు వెల్ల‌డించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైమానిక సర్వే నిర్వహించారు. దెబ్బతిన్న ప్రతి కొబ్బరి చెట్టుకు, ఆయిల్ పామ్ చెట్టుకు రూ. 1,500 పరిహారం ప్రకటించారు. రైతులకు పంట భీమా అందజేస్తామని, త్వరలోనే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు , నగదు చెల్లిస్తామ‌ని తెలిపారు. సుమారు 30,000 మంది సిబ్బందిని సహాయక చర్యల్లో నిమగ్నం చేశామ‌న్నారు. ఒక్క కోనసీమ ప్రాంతంలోనే 8,000 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వెట్లపాలెంలో తుపాను బాధితులైన రైతులతో ఆయన మాట్లాడారు. అనంత‌రం అమరావతిలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్ అంతటా జరిగిన ప్రాథమిక నష్టం రూ. 4,600 కోట్లుగా అంచనా వేశామని, పూర్తిస్థాయి పరిశీలన తర్వాత ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన వైమానిక సర్వే చేపట్టారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని గచకాయలపోర గ్రామంలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను పరిశీలించి, బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుపాను వల్ల జరిగిన నష్టం ,రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసేందుకు ఇవాళ కేంద్ర బృందం రానుందని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక నష్ట అంచనాలను కేంద్రానికి సమర్పించిందని తెలిపారు. కోనసీమ ప్రాంతంలోని వెట్లపాలెంలో నీట మునిగిన పొలాలను పరిశీలించామ‌న్నారు. అక్కడ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. పంట కోతకు కేవలం 15 రోజుల ముందు తుపాను రావడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version