యుద్ధ ప్రాతిప‌దిక‌న పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టండి

ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శిని ఆదేశించిన సీఎం చంద్ర‌బాబు

hellotelugu-APCM

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న అర్న‌బ్ తుపాను కార‌ణంగా చోటు చేసుకున్న ప‌రిస్థితుల‌పై ఆరా తీశారు. ఈ మేర‌కు స‌చివాల‌యంలో తుపాను కారణంగా చేపట్టిన సహాయక చర్యలు , పునరుద్ధరణ పనులపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 5,400 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగగా ఇప్పటికే 4,771 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరించడం జ‌రిగింద‌న్నారు. మిగిలిన 629 గ్రామాల్లో పునరుద్ధరణ పనులు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో ప్రభావితమైన 915 గ్రామాలకు గాను 835 గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించిన‌ట్లు తెలిపారు. మరో 80 గ్రామాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉందన్నారు.

ఇక రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో మొత్తం 2,396 కిలోమీటర్ల మేర ప్రధాన జిల్లా రహదారులు , రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు సీఎం. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 552 కి.మీ, కోనసీమలో 396 కి.మీ, తూర్పు గోదావరిలో 372 కి.మీ, శ్రీకాకుళంలో 309 కి.మీ, అనకాపల్లిలో 236 కి.మీ ,విశాఖపట్నంలో 211 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయని వెల్ల‌డించారు. రోడ్లపై ఏర్పడిన 62 గండ్లు పూడ్చగా, 22 చోట్ల పునరుద్ధరణ పూర్తయిందని పేర్కొన్నారు. అలాగే, 34 కాజ్‌వేలలో 13 చోట్ల పునరుద్ధరణ జరిగిందన్నారు. ఇంకా 40 గండ్లు, 21 కాజ్‌వేల వద్ద మరమ్మతులు చేపట్టాల్సి ఉందని తెలిపారు సీఎం. దెబ్బతిన్న 102 కల్వర్టులు మరియు ఇతర క్రాస్-డ్రైనేజీ నిర్మాణాలలో, 83 నిర్మాణాలు పునరుద్ధరించిన‌ట్లు వెల్ల‌డించారు. మిగిలిన 19 చోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని తెలిపారు.

రోడ్లపై పడిపోయిన మొత్తం 2,264 చెట్లను పూర్తిగా తొలగించిన‌ట్లు పేర్కొన్నారు. . సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య 183 చెట్లను తొలగించడం జరిగిందన్నారు. ఇందులో కాకినాడలో 127, తూర్పు గోదావరిలో 56 చెట్లు ఉన్నాయన్నారు. . రవాణాకు అంతరాయం కలిగిన 133 ప్రాంతాలలో, 99 చోట్ల రాకపోకలు పునరుద్ధరించిన‌ట్లు పేర్కొన్నారు. మిగిలిన 34 ప్రాంతాలలో ఇంకా అంతరాయం కొనసాగుతోందన్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం రాష్ట్రంలోని 16 జిల్లాల్లో సుమారు 3,33,268 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామ‌న్నారు. పంట నష్టానికి సంబంధించి తుది అంచనాలు ఇంకా ఖరారు కావాల్సి ఉందన్నారు. అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి (76,752 హెక్టార్లు), కాకినాడ (52,253 హెక్టార్లు), తూర్పు గోదావరి (49,959 హెక్టార్లు), కోనసీమ (46,845 హెక్టార్లు) , కృష్ణా (44,836 హెక్టార్లు) జిల్లాలు ఉన్నాయన్నారు.

Exit mobile version