నష్ట ప‌రిహారంపై నివేదిక‌లు సిద్దం చేయండి : సీఎం

కీల‌క ఆదేశాలు జారీ చేసిన చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-ChandraBabu

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న అర్నబ్ తుఫాన్ పై గురువారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు విశ్రమించొద్దని ఇప్పటికే అధికార యంత్రాంగానిక స్ప‌ష్టం చేశారు . కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి నెల‌కొంద‌ని ఈ సంద‌ర్బంగా అధికారులు సీఎంకు వివ‌రించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని క్షేత్ర స్థాయి పరిస్థితులు, పునరుద్దరణ పనులపై వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఆరా తీశారు. తుఫాన్ నష్టంపై ఇవాళ ప్రాథమిక నివేదికను అందిస్తామని తెలిపారు. పంట నష్టం మినహా బాధితులందరికీ నష్టపరిహారాన్ని అందించే పనిని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉండాలని అన్నారు. అర్నబ్ తుఫాన్ సమయంలో అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేసిందని కితాబు ఇచ్చారు. ఏపీలో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయ‌ని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఎల్ నినో ప్రభావంతో ఇబ్బందులు ఏర్ప‌డ్డాయ‌ని వాపోయారు. మిగిలిన ప్రాంతాల్లో అర్నబ్ తుఫాన్ వల్ల సమస్యలు ఉత్పన్నం అయ్యాయని పేర్కొన్నారు. ఈ రెండింటి విషయంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించి ప్రజలను ఆదుకోవాలని కోరారు. రాయలసీమలో పంటలు వేసుకునే పరిస్థితి లేద‌న్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి జిల్లాల్లో వేసుకున్న పంటలను, కొబ్బరి చెట్లను నష్టపోయిన దుస్థితి నెల‌కొంద‌ని పేర్కొన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

పక్కా ప్రణాళికతో ఈ ప్రకృతి విపత్తుల బారీ నుంచి ప్రజలను బయట పడేయాలన్నారు. అర్నబ్ తుఫాన్ వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వీలైనంత మేర తగ్గించేలా చూశాం అన్నారు. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామ‌ని, పడిపోయిన చెట్లను ఇప్పటికే చాలా వరకు తొలగించడం జ‌రిగింద‌న్నారు. ఇంకా ఎక్కడైనా పడిపోయిన చెట్లు రోడ్లపై ఉంటే వాటిని వెంటనే తొలగించాలన్నారు తుఫాన్ కారణంగా పోగైన చెత్తను కూడా తీసేయాలని పేర్కొన్నారు. రేపటిలోగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలని ఆదేశించారు. నష్ట పరిహారానికి సంబంధించిన అంశాలపై జీవో జారీ చేశాం అన్నారు . పంట నష్టం మినహా బాధితులకు నష్టపరిహరం అందించాలని స్ప‌ష్టం చేశారు. త్వరగా తుఫాన్ నష్టంపై అంచనాలు సిద్దం చేయాలని అన్నారు.

Exit mobile version