Bullet Train : భారతదేశంలోని తొలి హై-స్పీడ్ బుల్లెట్ రైలు సేవ స్వల్ప కాలంలో ప్రారంభంకానున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్లడించారు. ముంబై – అహ్మదాబాద్ మధ్య నడిచే ఈ బుల్లెట్ రైలు (Bullet Train) ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గించబోతోంది. ఇప్పటివరకు ఎనిమిది గంటలు పట్టే ఈ ప్రయాణాన్ని భవిష్యత్తులో కేవలం 2 గంటల 7 నిమిషాల్లో పూర్తిచేయగలమని మంత్రి స్పష్టం చేశారు.
ఈ రైలు గరిష్ఠంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో సాగనుంది. 508 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) నుంచి ప్రారంభమై వల్సాద్, సూరత్, వడోదర, ఆనంద్ మీదుగా అహ్మదాబాద్ వరకు సాగుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతోందని, త్వరలో పట్టాలెక్కబోతున్నదని రైల్వే వర్గాలు తెలియజేశాయి.
Bullet Train – భవిష్యత్ రైల్వే ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలు
గుజరాత్‌లోని భావ్‌నగర్ టెర్మినస్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో 34,000 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకి సగటున 12 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1,300కి పైగా స్టేషన్లను ఆధునికీకరణ చేస్తుండగా, గుజరాత్‌లో పోర్‌బందర్–రాజ్‌కోట్ మధ్య కొత్త రైలు సేవ, రాన్వావ్ స్టేషన్‌లో కోచ్ నిర్వహణ కేంద్రం, ఫ్లైఓవర్, గతి శక్తి టెర్మినల్స్ వంటి పలు ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు.
వందే భారత్ తరహాలో అమృత్ భారత్ రైళ్లు
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా రైల్వే ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ పాలన వల్ల అభివృద్ధి రేటు వేగంగా పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ వంటి ఆధునిక రైళ్లు సేవలు అందిస్తున్నాయని తెలిపారు.
వందే భారత్ తరహాలోనే, అమృత్ భారత్ రైళ్లలోనూ ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ, అధిక ఛార్జీల భారం లేకుండా ప్రయాణించవచ్చు. ప్రయాణికుల అభిప్రాయాలను స్వయంగా విన్నప్పుడు తాను భావోద్వేగానికి గురయ్యానని మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ప్రారంభం దేశ రైలు వ్యవస్థలో ఒక కొత్త శకానికి నాంది పలకనుంది.
Also Read : EPFO Growth Facts : మీ పీఎఫ్ ఖాతాలో డబ్బును ‘ఈపీఎఫ్ఓ’ ఎక్కడ పెట్టుబడి పెడుతుందో తెలుసా?
