అభా కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవ‌లు

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ కూట‌మి స‌ర్కార్

hellotelugu-AbhaCard

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పేద‌ల‌కు తీపి క‌బురు చెప్పారు. అభా కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని ప్ర‌క‌టించారు. ఫార్మా రంగానికి ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా ఉందని, మెడ్‌టెక్‌ పార్కు ద్వారా వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. వంటశాలను ఫార్మసీగా… ఆహారాన్నే ఔషధంగా భావించాలని సూచించారు. ఈ మేరకు ఆరోగ్య పద్దతులను మార్చుకోవాలని చెప్పారు. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, యోగాభ్యాసంతో ఎనర్జీ లెవల్స్‌ పెరుగుతాయని అన్నారు. సంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య రంగానికి నిధులు కేటాయిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

జేపీ నడ్డా నాయకత్వంలో దేశంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం మరింత మెరుగు పడుతుందన్న నమ్మకం ఉందన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూడిన డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వల్లే ఇటువంటి అభివృద్ధి సాధ్యమవుతోందని చెప్పారు. వైద్యారోగ్య రంగంతో పాటు అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని అందిస్తున్నామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని చెప్పారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకు వచ్చామని గుర్తు చేశారు. కేంద్ర సహకారం, రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్‌-1 స్థానంలో నిలుపుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు సహకరించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘హెల్తీ–వెల్తీ–హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌’ దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Exit mobile version