అమరావతి : ప్రజల కోసం ప్రశాంతిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. వారిది గౌరవంగా బతికే కుటుంబం, ఏనాడు తప్పు చేయలేదు. కొంతమంది రౌడీలు, నియోజకవర్గానికి ఒక్కపని చేయని వారు ఆమె గురించి మాట్లాడుతున్నారు. త్వరలో మీ టైం కూడా వస్తుంది, ఎవరినీ వదలిపెట్టం. నీతి,నిజాయితీగా ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన విపిఆర్ కుటుంబం గురించి, వారి క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు వైసిపి నాయకులకు ఎవరిచ్చారని నిప్పులు చెరిగారు మంత్రి లోకేష్. మరోసారి అటువంటి మాటలు మాట్లాడితే వారి సంగతి చూస్తా. అసెంబ్లీలో సైకోలు చేసిన వ్యక్తిత్వ హనన వ్యాఖ్యల వల్ల నాతల్లి మూడు నెలలు బాధపడింది అని అన్నారు. ఏనాడు నేను జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల గురించి మాట్లాడలేదు. ఆయన భార్య భారతి గురించి ఓ కార్యకర్త మాట్లాడితే జైలుకు పంపించాం. పార్టీ ఏదైనా రాజకీయం వేరు, కుటుంబం వేరుగా చూడాల్సిన అవసరం ఉందనన్నారు.
బుల్లెట్ దిగిందా, గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్న వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడో చూశాం. ఈరోజు అతడి పరిస్థితి ఏమిటి, బాబుగారి జోలికి ఎవరు వచ్చినా మాడి మసైపోయారని గుర్తు చేశారు లోకేష్. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని చేతల్లో చూపుతున్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అధ్యక్షుల వారి పక్కన సాధారణ కార్యకర్తలు కూర్చున్నారు. కడప మహానాడులో మనం చేసుకున్న ఆరు శాసనాల్లో ఒకటి కార్యకర్తే అధినేత. పసుపు సైన్యం త్యాగం, రక్తం వల్లే మనకు అధికారం దక్కింది. పల్నాడులో తోట చంద్రయ్య గొంతుపై కత్తిపెట్టి వారి పార్టీకి జైకొట్టమంటే జై టిడిపి, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారు. ఆయనే నాకు స్పూర్తి, ఆయన కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు చట్టాన్ని సవరించాం. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత టిడిపిది. మంజుల, అంజిరెడ్డి తాత ధైర్యాన్ని చూశాం. మనది ఒక పెద్ద కుటుంబం. కార్యకర్తల కోసం సంక్షేమ నిధి, ఇప్పటివరకు రూ.175 కోట్లు అందించాం. కార్యకర్తలు ఆర్థికంగా నిలదొక్కు కోవాలన్నదే మా లక్ష్యం. ప్రతి కార్యకర్త సొంత కాళ్లపై నిలబడాలన్నది బాబు ధ్యేయం. కార్యకర్తల ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం ముఖ్యం. మన ఆరోగ్యం బాగుంటే కుటుంబం, పార్టీ బాగుంటాయి.పార్టీ కార్యాలయంలో రక్త పరీక్షలు చేయించుకోండి. ఉచితంగా మందులు కూడా అందించే బాధ్యత నాది. మైటిడిపి, మై హెల్త్ యాప్ లు తెచ్చాం. ఆ కార్యక్రమానికి సహకరించండి అని కోరారు.

















