హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది హైదరాబాద్ లో. ఇందులో భాగంగా మాధాపూర్ గుట్టల్లో ఉన్న దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా దృష్టి పెట్టింది. చెరువులోకి నేరుగా మురుగు నీరు చేరడాన్ని హైడ్రా తీవ్రంగా పరిగణించింది. దుర్గం చెరువులో గుర్రపు డెక్క వ్యాప్తి చెందడం, దుర్గంధంగా మారడంపట్ల మీడియా కథనాలు, స్థానికుల నుంచి హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దుర్గం చెరువును పరిశీలించారు. చెరువులో సగభాగం వరకూ గుర్రపు డెక్క వ్యాపించడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఎస్‌టీపీలు ఉన్నప్పటికీ వరద కాలువ ద్వార మురుగు నీరు నేరుగా దుర్గం చెరువులోకి కలవడం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌టీపీలకు వెళ్లే మురుగు నీరు అధికంగా ఉండడంతో ఇటువైపు మల్లించాల్సి వచ్చిందని అక్కడ ఇరిగేషన్ ఇంజినీర్లు చెప్పగా అది సరికాదన్నారు.
ఎస్‌టీపీల సామర్థ్యానికి మించిన మురుగు నీరు వస్తే మురుగు కాలువకు మళ్లించాలి కాని.. నేరుగా చెరువులోకి ఎలా కలుపుతారని ప్రశ్నించారు. ఒకవైపు ఎస్‌టీపీ ద్వారా మురుగు నీటిని సుద్ధి చేసి చెరువులోకి పంపడం.. మరో వైపు నేరుగా మురుగు నీరు వదిలేయడం ఏంటని మండిపడ్డారు. చెరువును అభివృద్ధి చేయడం అంటే పైపై మెరుగులు దిద్దడం కాదని దుర్గం చెరువు పనులు చేపట్టిన రహేజా సంస్థ ప్రతినిధులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు ప్రశ్నించారు. చెరువులోకి మురుగు నీరు కలవడం.. గుర్రపు డెక్క వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి మీ వైపు చేసిన ప్రయత్నాలు ఏంటని అడిగారు.
