హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దూకుడు పెంచారు. హిమాయత్‌నగర్ – ఆదర్శనగర్ బస్తీ పరిసరాల్లో 30 ఏళ్ల మురుగు సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యకు గల కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. మురుగు నీరు సాఫీగా వెళ్లక ఇళ్లలోకి పోటెత్తి బోరు బావుల్లోకి చేరడం, నాలాల్లో కలవడం వల్ల తాగు నీరు కలుషితం అవుతోందని బాధితులు వాపోయారు. ఈ మేరకు ప్రజా వాణిలో పిర్యాదు చేశారు. 100 అడుగుల దూరంలో హుస్సేన్‌సాగర్ నాలా ఉండగా మురుగుతో పాటు వర్షం పడినప్పుడు వరద ముంచెత్తడానికి గల కారణాలను వాకబు చేశారు. హిమాయత్‌నగర్ కార్పొరేటర్ మహలక్ష్మి రామన్‌గౌడ్ కూడా ఈ పర్యటనలో ఉండి సమస్యను వివరించారు. హిమాయత్‌నగర్‌పై నుంచి వచ్చే మురుగు, వరద నీరు తమ ప్రాంతాలను ముంచెత్తుతోందని ఆదర్శనగర్ బస్తీ వాసులు కమిషనర్ ముందు వాపోయారు.
ఇదిలా ఉండగా గత 30 ఏళ్లుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదు చేశారు. సమస్యను బస్తీ వరకూ తీసుకు వచ్చి వదిలేయమని.. హుస్సేన్‌సాగర్ నాలా వరకూ పనులు పూర్తి స్థాయిలోనే చేపడతామని కమిషనర్ ఏవీ రంగనాథ్ హామీ ఇవ్వడంతో వారంతా ఊరట చెందారు. మురుగు, వరద నీరు ఎటువైపు వాలుగా వెళ్తుందో పరిశీలించి వెంటనే పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. 6 మీటర్ల మేర కొన్ని పైపు లైన్లు దెబ్బతిన్నాయని, వాటిని రీప్లేస్ చేస్తే సరిపోతుందని స్థానిక జలమండలి అధికారులు కమిషనర్‌కు వివరించారు. పై నుంచి వస్తున్న వరద, మురుగు నీటిని అంచనా వేసి.. తదనుగుణంగా పెద్ద పైపులు వేయాలని సూచించారు.
