తుది మెరుగులు దిద్దుకుంటున్న బ‌మృక్‌నుద్దౌలా

అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

hellotelugu-HYDRAA

హైద‌రాబాద్ : పాత‌బ‌స్తీకి మ‌ణిహ‌రంగా చారిత్ర‌క చెరువు బ‌మృక్‌నుద్దౌలా నిలుస్తుంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారు అన్నారు. ఆక్ర‌మ‌ణ‌ల‌తో ఆన‌వాళ్ల‌ను కోల్పోయిన ఈ చెరువు హైడ్రా పున‌రుద్ధ‌ర‌ణతో పూర్వ వైభ‌వాన్ని సంత‌రించుకుందని అన్నారు. మ‌రో 15 రోజుల్లో ప్రారంభానికి సిద్ధ‌మౌతున్న బ‌మృక్‌నుద్దౌలా చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ మంగ‌ళ‌వారం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. చుట్టూ బండ్ తో పాటు ఇన్‌లెట్లు, ఔట్ లెట్ల నిర్మాణాన్ని త‌నిఖీ చేశారు. చెరువుకు మూడు వైపులా నిర్మిస్తున్న‌ ప్ర‌వేశ మార్గాల‌ను ప‌రిశీలించారు. స్థానికంగా ఉన్న‌వారు సుల‌భంగా చెరువు చెంత‌కు చేరేలా చూడాల‌ని సూచించారు. నిజాంల కాలంలో ఈ చెరువుకు ఎంతో చ‌రిత్ర ఉంద‌ని.. దానిని పున‌రావృతం చేసేలా.. చుట్టూ ఔష‌ధ గుణాలున్న మొక్క‌ల‌తో పాటు.. చ‌ల్ల‌టి నీడనిచ్చే చెట్ల‌ను నాటాలని సూచించారు. అన్ని వ‌య‌సుల వారూ సుల‌భంగా న‌డిచేలా వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాల‌ని, లైటింగ్ చెరువు చుట్టూ ఉండేలా చూడాల‌న్నారు ఏవీ రంగ‌నాథ్.

పిల్లల కోసం ప్లే ఏరియాలు, వృద్ధుల కోసం సీటింగ్ జోన్లు, ఓపెన్ జిమ్‌లు, పచ్చికబైళ్లు, పార్కులు వంటి సౌకర్యాలు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్నారు. సీసీటీవీ కెమేరాల‌ను ఏర్పాటు చేసి.. హైడ్రా ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి ప‌ర్య‌వేక్షించేలా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇక్క‌డ ప్ర‌జ‌లు వ‌చ్చి కూర్చునేందుకు వీలుగా నిర్మిస్తున్న గుమ్మ‌టాల (గ‌జ‌బోలు)తో పాటు.. ప్ర‌వేశ గేట్లు ఇస్లామిక్ సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా అభివృద్ధి చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సూచించారు. వంద‌ల ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ చెరువును జాతి సంప‌ద‌గా భావిత‌రాల‌కు అందించాల్సిన అవ‌స‌రాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఆ క్ర‌మంలోనే చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌ను గ‌త ఏడాది ఆగ‌స్టు నెల‌లో తొల‌గించినట్టు చెప్పారు. 4.12 ఎక‌రాలుగా మిగిలిపోయిన ఈ చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయ‌డంతో 18 ఎక‌రాల మేర విస్త‌రించ‌డం జ‌రిగింద‌న్నారు.

Exit mobile version