బంగారు గనుల తవ్వకంలో ‘హట్టి–సింగరేణి’ కలిసి పని చేయాలి

ఉమ్మడి భాగస్వామ్యంతో పనిచేసే అవకాశాలను పరిశీలించాలి

hellotelugu-Bhatti

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ప‌ర్య‌టన‌లో బిజీగా ఉన్నారు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఆయ‌న క‌ర్ణాట‌క‌లో బంగారు గ‌నుల త‌వ్వ‌కాల‌ను ప‌రిశీలించారు. హ‌ట్టి – సింగ‌రేణిలు క‌లిసి ప‌ని చేయాల‌ని కోరారు. భవిష్యత్తు ప్రాజెక్టులలో ఉమ్మడి భాగస్వామ్యంతో పనిచేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఈ సంద‌ర్భంగా స‌హ‌కారంపై అధ్యయనం చేయాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. హట్టి , యుటి బంగారు గనులలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. బంగారు శుద్ది చేసే గ‌నుల ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. బంగారు గనుల తవ్వకంలో విస్తృత అనుభవం ఉన్న కర్ణాటక ప్రభుత్వ సంస్థ ‘హట్టి గోల్డ్ మైన్స్’ ‘సింగరేణి’ మధ్య ఉమ్మడి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థల సాంకేతిక సామర్థ్యాలు మరియు నైపుణ్యాలను అనుసంధానించడం ద్వారా దేశీయ బంగారు ఉత్పత్తిని పెంచడంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. బంగారు అన్వేషణ, తవ్వకం, ప్రాసెసింగ్ , శుద్ధి ప్రక్రియలలో హట్టి గోల్డ్ మైన్స్‌కు అపారమైన అనుభవం ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. బొగ్గు , ఇతర ఖనిజాల అన్వేషణ, తవ్వకంలో సింగరేణికి ఉన్న సాంకేతిక సామర్థ్యాలతో హట్టి సంస్థ యొక్క నైపుణ్యాన్ని జోడించాలని ఆయన సూచించారు . బంగారు అన్వేషణ, తవ్వకం, వెలికితీత, ప్రాసెసింగ్, శుద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సాంకేతిక నిపుణుల నియామకం, మానవ వనరుల శిక్షణ వంటి అంశాలలో ఈ రెండు సంస్థల మధ్య ఉమ్మడి సహకారం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన సింగరేణి అధికారులను ఆదేశించారు.

దేశ ఆర్థిక భద్రతలో బంగారం కీలక పాత్ర పోషిస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న బంగారు ఖనిజ వనరులను శాస్త్రీయ పద్ధతిలో అన్వేషించి, వెలికి తీయడంలో సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుండాలని ఆయన అన్నారు. బంగారు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. హట్టి–సింగరేణి భాగస్వామ్యం బంగారు ఉత్పత్తిని పెంచడానికి, అధునాతన సాంకేతికతను స్వీకరించడానికి, స్థానిక ఉపాధి అవకాశాలను కల్పించడానికి, దేశ ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేయడానికి దోహద పడుతుందని అన్నారు.

హుట్టి ప్రాజెక్ట్ ద్వారా రోజుకు సగటున 2 నుండి 4 కిలోగ్రాముల బంగారం ఉత్పత్తి అవుతుందని అధికారులు ఆయనకు తెలిపారు. అనంతరం ఆయన యుటి భూగర్భ గనిలో బంగారు ఖనిజ వెలికితీత పనులను పరిశీలించారు. ఖనిజ వెలికితీత , రవాణా, యంత్రాల వినియోగం , కార్మికుల భద్రతతో సహా భూగర్భ మైనింగ్‌కు సంబంధించిన వివిధ అంశాల గురించి ఆయన ఆరా తీశారు.

Exit mobile version