తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని కొన్ని జిల్లాల్లో బలమైన గాలి, వర్షం కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వుండాలని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి స్పష్టం చేశారు. బలమైన గాలి, వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎపిఎస్పిడిసిఎల్ అధికారులు, సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు ఒక్కో జిల్లాకు చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసరుగా నియమించినట్లు తెలిపారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, కండక్టర్, విద్యుత్ స్తంభాలు తదితర పరికరాలను అందుబాటులో ఉంచు కోవాలని సూచించారు. సంస్థ పరిధిలో సర్కిల్స్, డివిజన్స్ స్థాయిల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాలి, వర్షం ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడం కోసం అధికారులు, సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు అందుబాటులో వుండాలన్నారు. వర్షం కురుస్తున్న సందర్భాల్లో ప్రజలు విద్యుత్ స్తంభాలను తాకవద్దని, లైన్ల కింద నిల్చోవద్దని సూచించారు.
ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగి పడడంలాంటి సంఘటనలను గుర్తించినట్లయితే తక్షణమే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికిగానీ, విద్యుత్ బిల్లుపై ముద్రించబడిన తమ ప్రాంత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంబరుకు గానీ లేదా టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా సంస్థ వాట్సాప్ నంబరు: 91333 31912కు చాట్ చేయడం ద్వారా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించు కోవచ్చని స్పష్టం చేశారు శివ శంకర్ లోతేటి.
