అమరావతి : ఏపీని వడగాల్పులు వెంటాడుతున్నాయి. అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఇవాళ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 23 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు . వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విజయనగరం జిల్లా లోని బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, వంగర మండలాలలో ఎండ వేడిమి అధికంగా ఉంటుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా లోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అల్లూరి జిల్లా లోని జికే వీధి మండలంతో పాటు పోలవరం జిల్లా లోని చింతూరు, కూనవరం, వరరామ చంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక నిన్న కర్నూలు(జి) నగరడోనలో 44.8°C, కడపలో 44.2°C, అనంతపురం(జి) రాయదుర్గం, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44°C, మార్కాపురం(జి) కంభం, శ్రీసత్యసాయి(జి) తలుపలలో 43°C, అన్నమయ్య(జి) నూలివీడు, పల్నాడు(జి) గురజాలలో 42.7°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 42.6°C, తిరుపతి(జి) బేస్తపల్లిలో 42.5°C, అనకాపల్లి(జి) దేవరపల్లె, పోలవరం(జి) ఎర్రంపేటలో 42.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 28 జిల్లాలకుగాను 18 జిల్లాల్లోని 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైందని తెలిపారు.

















