సాగునీటి ప్రాజెక్టుల‌కు అనుమ‌తి ఇవ్వండి

కేంద్ర స‌ర్కార్ ను కోరిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

hellotelugu-Utta

హైద‌రాబాద్ : తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, నిధుల మంజూరు విషయంలో చొరవ చూపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వివిధ ప్రాజెక్టుల పురోగతి, వాటికి అవసరమైన అనుమతులు , నిధుల వివరాల గురించి వివ‌రించిన‌ట్లు చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి, సీతా సాగర్ , డిండి ప్రాజెక్టుల కోసం గత, ప్రస్తుత ప్రభుత్వాలు కలిసి సుమారు రూ. 50,000 కోట్లు ఖర్చు చేశాయ‌ని తెలిపారు. సుప్రీంకోర్టు స్టే సహా పలు కారణాల వల్ల వీటి పనులు ఏళ్లుగా నిలిచి పోయాయని వాపోయారు. దరఖాస్తులను స్వీకరించ వచ్చని, పర్యావరణ అంచనాలను చేపట్టవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. అయితే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వద్ద ఈ దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయ‌ని క్లియ‌ర్ చేయాల‌ని కోరామ‌న్నారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

ఈ మూడు ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధానమంత్రిని కోరామని సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు. అలాగే,అనుమతుల్లో జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా నిలిచి పోయిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి మట్టాన్ని 152 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర అంగీకారం కోరామన్నారు. గతంలో తుమ్మిడిహెట్టి వద్ద నీటి మట్టాన్ని 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం జరిగింద‌ని, అయితే పూర్తి రిజర్వాయర్ స్థాయిని 152 మీటర్లకు పెంచాల్సిన అవసరాన్ని మ్యాప్‌లు, గణాంకాలతో ప్రధానమంత్రికి వివరించామ‌ని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు ఈ అంశంపై కేంద్ర జల సంఘం సమావేశం నిర్వహించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తాను ముంబైకి వెళ్లి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిశామ‌న్నారు. మహారాష్ట్ర నుంచి అంగీకారం పొందేలా ప్రధానమంత్రి చొరవ చూపాలని కోరడం జ‌రిగింద‌న్నారు. ప్రాజెక్టు వల్ల అదనంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలకు సంబంధించి, కేంద్రం లేదా మహారాష్ట్ర నిర్ణయించే పరిహారాన్ని చెల్లించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు.

సమ్మక్క-సారక్క బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని, హైడ్రోలాజికల్ క్లియరెన్స్ కూడా లభించిందని ఉత్తమ్ తెలిపారు. బ్యారేజీని పూర్తి సామర్థ్యంతో వినియోగించు కునేందుకు వీలుగా ఛత్తీస్‌గఢ్ నుండి ఎన్‌ఓసిజారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధానమంత్రిని కోరినట్లు ఆయన చెప్పారు . ఛత్తీస్‌గఢ్ కోరిన మేరకు, ఐఐటి ఖరగ్‌పూర్ నుండి ముంపుకు సంబంధించిన నివేదికను పొందామన్నారు. అదనపు డిపిఆర్ కోసం వారు కోరిన మొత్తాన్ని కూడా చెల్లించామ‌ని తెలిపారు. ముంపు వల్ల కలిగే నష్టానికి పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిపామ‌న్నారు.

Exit mobile version