తాడేపల్లిగూడెం : మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. మోసం చేయడం, అబద్దాలు చెప్పడం సీఎంకు అలవాటుగా మారిందన్నారు. రాయలసీమలో ఉద్యానవన పంటల పెట్టుబడి ప్రకటనతో రైతులకు నమ్మక ద్రోహం చేశారని జగన్ ఆరోపించారు. ఉద్యానవన పంటల అభివృద్ధికి రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పి తీరా చూస్తే రైతులను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఈ ప్రతిపాదనకు ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు లేవని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఈ పెట్టుబడి కోసం నిధులు కేటాయించలేదని లేదా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఉద్యానవన , ఇతర పంటలు పండించే రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన విమర్శించారు.
గత రెండేళ్లన్నర కాలంలో రైతుల పట్ల మీకున్న శ్రద్ధ కేవలం మాటలకే, ప్రచారానికే పరిమితమని మీ ప్రభుత్వ పనితీరు పదేపదే రుజువు చేసిందని ఫైర్ అయ్యారు జగన్ రెడ్డి. ఉద్యానవన, ఇతర పంటలు పండించే రైతులకు సరైన ధరలు లభించక వారు నిరసనలతో రోడ్లెక్కినప్పుడు, మీరు ఎప్పుడైనా వారి సమస్యలను పట్టించుకున్నారా? అని నిలదీశారు. మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ధరల స్థిరీకరణ నిధిసని మీరు బలహీన పరచడం, ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడం ద్వారా రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టడం వాస్తవం కాదా? అని జగన్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ప్రచార కార్యక్రమాలను మాత్రమే విజయాలుగా చెప్పుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వం, ‘సున్నా వడ్డీ రుణ పథకం’ను రద్దు చేసిందని ఆరోపించారు. సకాలంలో అందాల్సిన వ్యవసాయ ఉత్పాదక సబ్సిడీలు దెబ్బ తీసిందని జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
