GST : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు, పేదలకు, మధ్యతరగతికి మేలు చేకూరేలా పలు ఉత్పత్తులు, సేవలపై జీఎస్టీ రేట్లను గణనీయంగా తగ్గించింది. జీఎస్టీ (GST) కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందిన ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఉపశమనం కలిగించనున్నాయి.
GST Reforms
వ్యవసాయ రంగానికి మేలు కలిగేలా ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, బయో పెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీని వలన రైతులు వ్యవసాయ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోగలరు. పరికరాల ధరలు తగ్గడం వల్ల ఉత్పత్తి వ్యయం కూడా తగ్గే అవకాశం ఉంది.
అలాగే సామాన్య ప్రజలకు ఊరట కలిగించేలా వ్యక్తిగత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌పై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు. ఇకపై బీమా సదుపాయాలపై ఎటువంటి పన్ను ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. దీని వలన బీమా పాలసీల ప్రీమియం ఖర్చు తగ్గి, మరింత మంది బీమా సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.
వైద్య రంగానికీ గణనీయమైన ఉపశమనం లభించింది. మెడికల్ ఆక్సిజన్, డయాగ్నస్టిక్ కిట్‌లు, గ్లూకోమీటర్, కళ్లజోడులు వంటి వాటిపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం వల్ల హాస్పిటల్ బిల్లులు తగ్గి, రోగులపై ఆర్థిక భారం కొంతవరకు తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాలు రైతులకు, రోగులకు, సాధారణ ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించనున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read : Milk Price Drop : జీఎస్టీ రిఫార్మ్స్ తో తగ్గనున్న పాల ధరలు
