గోదావ‌రి పుష్కరాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-APCM

అమ‌రావ‌తి : వ‌చ్చే ఏడాది 2027లో గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై సచివాలయంలో వివిధ శాఖలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగ‌ళ‌వారం సమీక్ష చేప‌ట్టారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుపై సమీక్షలో మంత్రుల కమిటీతో పాటు వివిధ శాఖల అధికారులతో సమగ్రంగా చర్చించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్ర‌క‌టించారు సీఎం.

ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి చేసిన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని పనులు చేపట్టాలని పేర్కొన్నారు. పుష్కరాల నిర్వహణతో పాటు రాజ మహేంద్రవరం లాంటి నగరం ఓ మెగాసిటీగా అభివృద్ధి అయ్యేలా పనులు చేపట్టాలని సూచనలు చేశారు. కేవలం పుష్కరాలకు మాత్రమే పనులు పరిమితం చేయకుండా ప్రస్తుతం కల్పిస్తోన్న మౌలిక వసతులు గోదావరి పరివాహక ప్రాంతానికి ఆస్తిగా మారాలని స్ప‌ష్టం చేశారు సీఎం. పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాల పనులు చేప‌ట్టాల‌న్నారు . రాష్ట్రంలో 212 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తోన్న గోదావరి నది. పోలవరం జిల్లా గుండాలలో మొదటి పుష్కర ఘాట్ తో పాటు కోనసీమ జిల్లా అంతర్వేది, బలుసుతిప్ప, కాకినాడలోని గోవాలంక, పశ్చిమగోదావరిలోని నర్సాపురంలో చివరి ఘాట్‌ నిర్మాణ ప్రతిపాదనలు త‌యారు చేయాల‌న్నారు.

Exit mobile version