దానం, క‌డియంల‌కు క్లీన్ చిట్ ఇవ్వ‌డం దారుణం

తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డంపై కేటీఆర్ ఆగ్ర‌హం

hellotelugu-KTR

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర స‌భాప‌తి గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు క్లిన్ చిట్ ఇవ్వడం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవాళ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. ఒక రకంగా ఈ నిర్ణ‌యంతో డెమోక్ర‌సీ లేద‌న్న‌ది తేలి పోయింద‌న్నారు. ఇప్ప‌టికే అడ్డ‌గోలు హామీలతో అధికారంలోకి వచ్చిన స‌ర్కార్ ప‌ట్ల ప్ర‌జ‌లు ఏదో ఒక‌రోజు క‌ర్ర‌కాల్చి వాత పెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. త‌మ పార్టీ ఇచ్చిన‌ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం తప్ప మ‌రోటి కాద‌న్నారు కేటీఆర్.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక తీర్పు కాద‌ని, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహర‌ణ త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన వారు పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే ఇక ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయని నిల‌దీశారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయ‌ని అన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని హెచ్చ‌రించారు.

Exit mobile version