ఓఆర్ఆర్ వ‌ర‌కు జీహెచ్ఎంసీ విస్త‌ర‌ణ

27 మున్సిపాల్టీలు ఇక హైద‌రాబాద్ ప‌రిధిలో

helotelugu-GHMCExpanssion

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా ప‌లు ప్రాంతాలు ఇక నుంచి హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోకి రానున్నాయి. ఇదంతా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్న ప్ర‌య‌త్నం అంటూ మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేత‌లు ఆరోప‌ణ‌లు చేశారు. అయినా ఎక్క‌డా ప‌ట్టించుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీ ప‌రిధిలోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి ఉత్త‌ర్వులు కూడా వెలువ‌డ్డాయి. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) విస్తరణ అంశం భౌగోళికంగా రాష్ట్రానికి, రాజధాని హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకతను తీసుకు వ‌స్తుంద‌ని స‌ర్కార్ పేర్కొంటోంది.

జీహెచ్ఎంసీ చట్టం-1955 ప్ర‌కారం ఓఆర్ఆర్ ప‌రిధిలోకి వ‌చ్చే పుర‌పాలిక సంఘాల‌ను త‌న‌లో విలీనం చేసుకుంది. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు జనాభా నిష్పత్తిలో 300 డివిజన్లకు పెరిగే అవకాశం ఉందని అంచ‌నా వేస్తున్నారు. అయితే భౌగోళికంగా డివిజన్ల విభజన, రిజర్వేషన్లు ఖరారు వంటి ప్రక్రియ రాజకీయ అంశాలతో ముడిపడి ఉంద‌ని జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. కొత్తగా ఏర్పడిన హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ‌లో ప్ర‌స్తుతం ఉన్న జోన్ల కంటే 15 జోన్లుగా విభ‌జించ‌నున్నారు. ఇక జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యం అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో రూపుదిద్దుకోనుంది. ప్ర‌స్తుతం ట్యాంక్ బండ్ వ‌ద్ద ప్ర‌ధాన కార్యాల‌యం ఉంది. కొత్త‌గా ఏర్పాటు కాబోయే జీహెచ్ఎంసీకి స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేదా సీనియర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారి కమిషనర్ గా పోస్టింగ్ కల్పించ‌నున్నారు.

Exit mobile version