KTR : హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ ఈ రెండేళ్ల పాలనలో అభివృద్ది చెందిన తెలంగాణను భ్రష్టు పట్టించిందని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). తెలంగాణ భవన్ లో శుక్రవారం ఎంఐఎం పార్టీకి చెందిన నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలకు శాపంగా మారిందన్నారు. రౌడీకి ఎవరైనా టికెట్ ఇస్తారా అని ప్రశ్నించారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇస్తాం , యువతులకు స్కూటీలు ఇస్తాం, వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామంటూ నిలువునా మోసం చేశారని ఆవేదన చెందారు. నమ్మిన ప్రజలకు ఇప్పుడు అసలు వాస్తవం ఏమిటో అర్థమైందన్నారు. మంత్రులు పాలనను గాలికి వదిలి వేశారని, పంపకాల కోసం , వాటాల కోసం కొట్లాడే పరిస్తితికి పాలనను తీసుకు వచ్చారని వాపోయారు కేటీఆర్.
KTR Slams Congress Govt
రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా దారి తప్పించిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని అన్నారు. ఆ డబ్బులు తీసుకొని మిగితా బాకీ డబ్బులు ఎప్పుడిస్తారో నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇవి కారుకు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు కేటీఆర్. పేదల ఇండ్లు కూలగొట్టిన ఈ బుల్జోజర్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని ఆయన ధైర్యం చెప్పారు. ప్రజలకు తాము ఎప్పటికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Also Read : Manda Krishna Madiga Strong Support : బీసీ విద్యార్థి దీక్షకు ఎంఆర్పీఎస్ మద్దతు
