అమరావతి : ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకు ఊకకాయ సమస్యతో బాధపడే వారు ఎక్కువ అవుతున్నారని అన్నారు. ఇందులో భాగంగా సమస్య తీవ్రతను గుర్తించామని, పరిష్కరించేందుకు గాను ఉమ్మడి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పెరుగుతున్న ఊబకాయం, జీవక్రియ సంబంధిత ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఆరోగ్యం, విద్య, క్రీడలు , మహిళా సంక్షేమ శాఖలతో కూడిన ఒక ఉమ్మడి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలో ఊబకాయం , జీవక్రియ ఆరోగ్యంపై జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక సూచనలు కూడా చేశారు. ప్రజారోగ్యానికి సవాలుగా మారిన ఊబకాయం సమస్యపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిని ఎదుర్కోవడానికి ఉమ్మడి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడలో ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ (CII) ఆధ్వర్యంలో జరిగిన ఊబకాయం, జీవక్రియ ఆరోగ్యంపై రాష్ట్ర స్థాయి సమావేశంలో పలువురు కీలక సూచనలు చేశారు. ప్రధానంగా జీవనశైలిలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని పేర్కొన్నారు నిపుణులు. ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడే కొద్దీ వారిలో ఊబకాయం వ్యాప్తి కూడా పెరుగుతోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రజారోగ్యం, ఉత్పాదకత , ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఈ సందర్బంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (NFHS-6) గణాంకాలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో 47.90 శాతం మంది మహిళలు , 44.40 శాతం మంది పురుషులు అధిక బరువుతో ఉన్నారని ఆయన తెలిపారు.
శారీరక శ్రమ లేకపోవడం, అతిగా తినడం, అత్యధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు , చక్కెర పానీయాల వినియోగం, పని ఒత్తిడి, అలాగే మొబైల్ ఫోన్‌ల ముందు ఎక్కువ సమయం గడపడం వంటివి ఊబకాయానికి కారణాలు అని ఆయన వివరించారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా చూసేందుకు తాము ఆహార భద్రత శాఖను బలోపేతం చేస్తున్నామన్నారు.
