హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మర్యాద పూర్వకంగా కలిశారు ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం , ఎంపీ అఖిలేష్ యాదవ్. తను హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్బంగా తనకు స్వాగతం పలుకుతామంటే వద్దని తానే స్వయంగా కలవడం ఆనందంగా ఉందన్నారు. ఇది రాజకీయాలలో సత్ సాంప్రదాయానికి మార్గం వేసేలా చేసిందన్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికామన్నారు. వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగిందని చెప్పారు కేటీఆర్. మాతో సమయం గడిపినందుకు అఖిలేష్ యాదవ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
ఒకప్పుడు శాసనసభలో అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్లో తక్కువ సీట్లు సాధించినా, ప్రజల వెంట నిలబడినందుకు అఖిలేష్ యాదవ్ పార్టీ ఇప్పుడు 37 మంది ఎంపీలను గెలుచుకుందని అన్నారు. అంతే కాకుండా దేశంలోనే మూడో అతి పెద్ద పార్టీగా నిలిచిందని ప్రశంసలు కురిపించారు. అఖిలేష్ యాదవ్ పార్టీ స్ఫూర్తితో తమ భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో ముందుకు సాగుతుందన్నారు. ప్రజల వెంట నిలబడి వారి తరపున తమ గొంతును వినిపిస్తామని చెప్పారు కేటీఆర్. రాజకీయాలలో గెలుపు ఓటములు సర్వ సాధారణమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తాము పవర్ లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు కేటీఆర్. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ అవుతారని వెల్లడించారు.
