న్యూఢిల్లీ : భారత దేశంలో న్యాయవ్యవస్థ పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడైతే దేశంలో మోదీ సర్కార్ కొలువు తీరిందో ఆనాటి నుంచి నేటి దాకా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం కావడం పట్ల ఆందోళన కొనసాగుతోంది. ఈ విషయాన్ని ప్రధాన పార్టీలతో పాటు కవులు, కళాకారులు, మేధావులు, బుద్ది జీవులు, పౌర సమాజం పలు ప్రశ్నలను సంధిస్తూ వచ్చింది. కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌కే కౌల్ బాంబు పేల్చారు. ఆయన సుప్రీంకోర్టుతో పాటు భారతీయ న్యాయ వ్యవస్థలో చోటు చేసుకున్న లోపాలను ఎత్తి చూపారు. ఆయన స్వయంగా వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అనే పేరుతో ఓ పుస్తకం రాశారు. అందులో తన అనుభవాలను పంచుకున్నారు. సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసేలా చేసింది. మాజీ సీజేఐ గురించి వెల్లడించిన విషయాలు గురించి పేర్కొనడం కలకలం రేపింది.
కొలీజియం సమావేశానికి ముందే న్యాయమూర్తుల పేర్లపై ప్రభుత్వ “ముందస్తు అనుమతి” తీసుకునే వారంటూ మాజీ సీజేఐపై బాంబు పేల్చారు సంజయ్ కౌల్. ఐదు పేర్లు ఖరారైన తర్వాత చివరి నిమిషంలో ఆరో పేరు తెచ్చారని, సమావేశం మధ్యలోనే ప్రభుత్వానికి ఫోన్ చేసి అడగాలా అని అడిగారన్నారు. పీఎంఎల్ఏ తీర్పు పునః పరిశీలనలో “మధ్యేమార్గం” తీసుకోమని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. జడ్జీల నియామకాల కేసును తన బెంచ్ నుంచి తప్పించారని ఆరోపించారు. ప్రభుత్వంతో అవసరానికి మించి మెతకగా వ్యవహరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు జస్టిస్ చంద్రచూడ్ గురించి. మొత్తంగా న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, దర్యాప్తు సంస్థలు, రాజ్యాంగ సంస్థల బలం, స్వతంత్రత మీద నిలబడాలే తప్పా బలహీన పడకూడదు. ఆ స్వతంత్రతే పోతే ప్రజాస్వామ్యం పేరుకే మిగులుతుందని గుర్తు పెట్టుకోవాలి.
