హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని, కౌంట్ డౌన్ మొదలైందన్నారు. రాబోయే 500 రోజుల్లో తిరిగి రాష్ట్రానికి సీఎంగా కేసీఆర్ కొలువు తీరడం ఖాయమని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో 4.71 లక్షల ‘ఆసరా’ పింఛన్లను తొలగించి, కొత్తగా 4.63 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇస్తున్నామని చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కనీసం లక్ష మందిని అయినా కోటీశ్వరులను చేశారా? అని నిలదీశారు కేటీఆర్. ఒకవేళ చేసి ఉంటే, నేను రాజకీయాల నుండే తప్పుకుంటానని సవాల్ విసిరారు. నిజమైన ‘ఫ్యూచర్ సిటీ’ (భవిష్యత్తు నగరం) వరంగల్ మాత్రమే. ఈ నగరాభివృద్ధి బాధ్యత నాది అని ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కేటీఆర్. కేవలం రేవంత్ రెడ్డి, పొంగులేటిల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయడానికే ఈ కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. రాబోయే ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేటీఆర్. నేత కార్మికులు, ఇతర కార్మికులు ఉపాధి కోసం భివాండి, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉండేందుకు గాను తమ ప్రభుత్వ హయాంలో వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు’ను ఏర్పాటు చేశాం అని గుర్తు చేశారు. కిటెక్స్ (Kitex), గణేశా ఎకోస్పియర్ (Ganesha Ecosphere), యంగ్ వన్ (Young One) వంటి పరిశ్రమలను తీసుకువచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించామన్నారు.
