ఢిల్లీ – మత్స్య సహకార సంఘాల జీవనోపాధి సవాళ్లపై తిరుపతి ఎంపీ గురుమూర్తి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం వివరణ ఇచ్చింది. తీర ప్రాంతంతో సంబంధం లేని ప్రాథమిక మత్స్యకార సహకార సంఘాల ఏర్పాటుతో పాటు సహకార సంఘాల నిర్వహణలో అవకతవకలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి అని వివరాలు కోరారు. ఈ ప్రశ్నకు కేంద్ర మత్స్య శాఖా సహాయ మంత్రి జార్జ్ కురియన్ సమాధానం ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద దేశ వ్యాప్తంగా సహకార సంఘాల ఏర్పాటుకు కేంద్రం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఇప్పటికే 2 వేల సహకార సంఘాలను “ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్“ గా అభివృద్ధి చేయడానికి, కొత్తగా 195 ఎఫ్.ఎఫ్.పి.ఓలు ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. అలాగే, 2024-25 నుండి 2033-34 మధ్య రెండు దశల్లో 12 వేల కొత్త మత్స్యకారుల సహకార సంఘాలు ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.
ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ-యోజన కింద 5500 ప్రాథమిక సహకార సంఘాలకు శిక్షణ, మెంటరింగ్, ఆర్థిక సహకారం అందించ బడుతుందని చెప్పారు. అయితే, సహకార సంఘాల నిర్వహణలో అవకతవకలు, జోక్యాలు, మార్గదర్శకాల ఉల్లంఘన జరిగినట్లు కేంద్రానికి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సంఘాలు సంబంధిత రాష్ట్రాల సహకార సంఘాల చట్టాల ప్రకారం పని చేస్తుండటంతో, వాటికి సంబంధించి సమస్యలు వచ్చినపుడు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. మత్స్యకారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్రం రాష్ట్రాలతో సమన్వయం, నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్‌ఫాం, మరియు జాతీయ సహకార డేటాబేస్ ద్వారా సహకారం అందిస్తున్నదని మంత్రి వివరించారు.
ఈ సందర్బంగా ఎంపి గురుమూర్తి మాట్లాడుతూ తీర ప్రాంతేతర మత్స్యకారుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘాలపై పాలకుల జోక్యాలను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పథకాల అమలు పర్యవేక్షణ కోసం కేంద్ర స్థాయిలో ప్రత్యేక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్రాలు నివేదించిన ఫిర్యాదులపై కేంద్రం నేరుగా సమీక్షించగల సామర్థ్యం కలిగిన పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.
















