Srinivas Goud : హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని మండిపడ్డారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud). తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇప్పటి వరకు వాటి గురించి ఊసెత్తడం లేదన్నారు. గత 22 నెలలు మాట్లాడకుండా ఉండి ఈ రోజు హడావుడిగా 42 శాతం రిజర్వేషన్లు అంటున్నారని , ఇదంతా రాజకీయ పరంగా లబ్ది పొందడం తప్పితే మరోటి కాదన్నారు. చట్టబద్ధతతో ఇస్తాం అన్నారు కానీ ఎందుకు చట్టబద్ధత తేలేదని ప్రశ్నించారు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉంటే ఆదరా బాదరాగా జీవో ఎందుకు తీసుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని హైకోర్టు ధర్మాసనం అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం కులగణన చేశారని, బీహార్ ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్లు చేస్తున్నారని, ఇదంతా ఎన్నికల డ్రామా తప్ప ఏమీ లేదని ఫైర్ అయ్యారు.
Ex Minister Srinivas Goud Slams Congress Govt
ఎన్నికల తర్వాత కోర్టు కొట్టి వేస్తే పరిస్థితి ఏంటో ఆలోచించాలన్నారు వి. శ్రీనివాస్ గౌడ్. గెలిచిన వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎటు పోతారని మండిపడ్డారు. రాజకీయం కోసమే హైకోర్టుకు పోయి హంగామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైకోర్టు ఒప్పుకుంటే సంతోషమే.. కానీ జడ్జి ప్రశ్నలకు సమాధానం లేదన్నారు. బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీసీ మంత్రులు మాత్రమే హైకోర్టుకు వెళ్లారని, మరి ఓసీ మంత్రులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఏదైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఎక్కడ ఉందని నిలదీశారు. రాష్ట్రపతి వద్ద బిల్ ఆమోదింప చేస్తామంటే అసెంబ్లీలో తాము మద్దతు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రయోగశాలగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు, ఓసీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
