Chinta Mohan : తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడేందుకు బండి సంజయ్ ఎవరు అంటూ ప్రశ్నించారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chinta Mohan). 1000 మంది అన్యమతస్తులు ఉన్నారని చెప్పడం దారుణమన్నారు. బండికి సోయి లేకుండా పోయిందన్నారు. వాస్తవాలు తెలుసు కోకుండా ఎలా మాట్లాడతారంటూ నిలదీశారు. తిరుమల కొండపై 5 వేల మంది అన్యమతస్తులు ఉన్నారని, వాళ్లు ఎవరు..ఏం పని చేస్తున్నారో మీకు తెలుసా అని మండిపడ్డారు.
Chinta Mohan Shocking Comments on Minister Bandi Sanjay
తిరుమల కొండకు వస్తున్న భక్తుల మల, మూత్రాలను ప్రతిరోజూ శుభ్రం చేస్తున్నారని అన్నారు. మంగళవారం చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు తిరుపతిలో. పొట్టకూటి కోసం పది, పన్నెండు వేల రూపాయలకు పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆదివారం చర్చికి పోతున్నారని, వాళ్ల ఇళ్లల్లో బైబిల్ ఉందన్నారు. మల, మూత్రాలను కడిగి శుభ్రం చేస్తున్న 5000 మంది కార్మికులను తీసేసే దమ్ము నీకుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ నుంచి మనుషులను తెచ్చి, తిరుమల కొండపై టాయిలెట్లు కడిగించగలవా బండి సంజయ్ అని ఫైర్ అయ్యారు. బిజెపి నాయకులకు వేరే పని పాటా లేదంటూ మండిపడ్డారు చింతామోహన్. దేశంలో పేదలు మరింత పెరుగుతున్నారని, సంపదనంతా అంబానీ, అదానీలకు దోచి పెట్టడంతోనే మీకు సరిపోతోందంటూ ధ్వజమెత్తారు. కూటికి లేక, జాబ్స్ రాక, ఉపాధి లేక రోజూ చస్తున్నారని, వారి గురించి ఆలోచించాలని సూచించారు.
వందేళ్ళ క్రితం మహాత్మా గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఆలయ ప్రవేశం చేయించిందన్నారు. తిరుమలలో అంటరానితనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తిరుమల ఆలయంలో పేస్కార్, డిప్యూటీ ఈవో పోస్టింగ్ ఎస్సీలకు ఇచ్చామన్నారు చింతా మోహన్. కూటమి ప్రభుత్వ పాలనలో తిరుమల ఆలయంలో ఒక్క ఎస్సీ ఆఫీసరైన ఉన్నారా అని నిలదీశారు. వందల సంఖ్యలో అంగళ్లు కొండపై ఉన్నాయని, ఒక్క ఎస్సీ కైనా, ఒక్క ఓబీసీ కైనా ఇచ్చారా అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలన్నారు. బిజెపి, ఎన్డీఏ పాలనలో లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు.
Also Read : Youtube New Rules Shocking : నేటి నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్
