టీవీకే ప్రభుత్వం వ్యవస్థాగత రాజకీయాలకు ప్రత్యామ్నాయం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్

hellotelugu-CMVijay

చెన్నై : తన ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రల గురించి సీఎం విజయ్ చంద్ర‌శేఖ‌ర్ హెచ్చరించారు, కానీ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు. తమిళుల ప్రయోజనాలను కాపాడటంలోనూ రాష్ట్రం నుండి అవినీతి, మాదకద్రవ్యాల సంస్కృతిని నిర్మూలించడంలోనూ ఎటువంటి రాజీ పడబోమని ప్ర‌క‌టించారు. తన ప్రభుత్వాన్ని వ్యవస్థాగత రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా అభివర్ణించారు. మనుషులందరూ సమానంగా జన్మించారనే సూత్రం పైనే తన ప్రభుత్వం నిర్మితమైందని ఆయన పేర్కొన్నారు. తన ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రల గురించి హెచ్చరించారు, కులం, మతం , సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రస్తావించారు సీఎం. తమిళం, ఆంగ్ల భాషలలో సాగిన ఈ ప్రసంగం ద్వారా విజయ్ రాష్ట్రంలోని తన ప్రధాన మద్దతు వర్గమైన ‘జెన్-జెడ్’ యువతను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలను ‘వణక్కం’ తో పలకరించారు.

అవినీతి నుండి తమిళనాడును రక్షించడం అనేది ప్రజలకు తన ప్రభుత్వం అందిస్తున్న ఒక రకమైన స్వేచ్ఛ అని విజ‌య్ అన్నారు. దీనితో పాటు, ప్రభుత్వ ఆదాయం దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడం, మహిళల భద్రత , సామాజిక న్యాయాన్ని కల్పించడం ద్వారా పారదర్శకమైన , నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సమర యోధులకు నివాళులర్పిస్తూ, వారి త్యాగాలు దేశానికి నిరంతరం స్ఫూర్తినివ్వాలని విజయ్ ఆకాంక్షించారు. పరిపాలన సంబంధిత విషయాలలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని, అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం కచ్చితమైన వైఖరిని అవలంబిస్తామని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమ పాలనను కొనసాగిస్తామని సంకేతాలిస్తూ, గత ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన ఉపయోగకరమైన పథకాలన్నింటినీ టీవీకే ప్రభుత్వం కొనసాగిస్తుందని విజ‌య్ చెప్పారు. అన్నా డీఎంకే తీసుకు వ‌చ్చిన అమ్మ క్యాంటీన్లు, డీఎంకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల అల్పాహార పథకం నిరంతరాయంగా కొనసాగుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ బాధ్యత తీరిపోయిందని భావించి ప్రభుత్వంతో సంబంధాలు తెంచుకోవద్దని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు; 2036 నాటికి రాష్ట్రాన్ని 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నందున, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలులో ప్రజల నిరంతర భాగస్వామ్యం అవసరమని ఆయన ఆకాంక్షించారు.

Exit mobile version