అమరావతి : అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఇంటి నుంచే స్థితిస్థాపకత ప్రారంభం” అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ , యునిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ వర్క్‌షాప్‌ను మంగళవారం ఎస్డీఎంఏ కార్యలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిఎస్డీఎంఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ బానో మాట్లాడుతూ విపత్తుల సమర్థవంతమైన నిర్వహణకు ప్రభుత్వ వ్యవస్థలతో పాటు ప్రతి కుటుంబం, యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, శిక్షణ, అవగాహన కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ విపత్తు సంసిద్ధులుగా తీర్చిదిద్దడమే ఈ వర్క్‌షాప్ ముఖ్య ఉద్దేశమని తెలియ జేశారు. ఈ వర్క్‌షాప్‌లో విపత్తు సంసిద్ధత, ప్రమాదాల నివారణ, అవగాహన పెంపొందించడం, సామర్థ్యాల బలోపేతంపై విస్తృతంగా చర్చించారు.
వివిధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచే యడం ద్వారా కుటుంబ, పాఠశాల, కమ్యూనిటీల స్థాయిలో విపత్తు స్థితిస్థాపకతను ఎలా పెంపొందించవచ్చు అనే విషయాలపై పాల్గొన్న విభాగాల ప్రతినిధులు తమ సూచనలను పంచుకున్నారు. విపత్తు సంసిద్ధత, కమ్యూనిటీల భాగస్వామ్యం కోసం తమ శాఖల పరంగా చేపడుతున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలను ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో విపత్తుల సంస్థ ఎవో రవిబాబు, ఎస్ఈవోసి ఇంచార్జ్ పీటర్, ప్రాజెక్టు కోర్డినేటర్ డా.బి.ప్రసాద్, సిబివో తనూజ, ప్రాజెక్టు మేనేజర్లు, ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్. ఎన్డీఆర్ఎఫ్, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, మై భారత్, భారత్ స్కౌట్స్ & గైడ్స్ వంటి యువజన విభాగాల కీలక అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
