అమరావతి : సీఎం చంద్రబాబు కుటుంబానికి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఇలవేల్పు. వేంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టానని, తనకు పునర్జన్మ లభించింది కూడా వేంకటేశ్వర స్వామి కటాక్షం వల్లేనని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చెబుతూనే వచ్చారు. అలాంటి వేంకటేశ్వర స్వామి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో తాను.. తన కుటుంబం ఉంటుందని సందర్భం వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి భక్తి భావంతో చెబుతారు. మాటలు చెప్పడమే కాదు.. దాన్ని తూచా తప్పకుండా సీఎం చంద్రబాబు ఆచరణలో పెడుతున్నారు. సీఎం హోదాలో ఉన్నవారికి తిరుమలలో మహాద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. సీఎంకు ప్రొటోకాల్ ఉంటుంది. తిరుమలలో మహా ద్వార దర్శనం చేసుకోవచ్చు.
కానీ దేవుని ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని సీఎం చంద్రబాబు పాటిస్తారు. అందుకే చంద్రబాబు తిరుమల కొండకు ఎప్పుడు వచ్చినా… క్యూ కాంప్లెక్స్ ద్వారానే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో తప్పించి… మిగిలిన సందర్భాల్లో క్యూ కాంప్లెక్స్ ద్వారానే కుటుంబంతో సహా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూ కాంప్లెక్స్ మార్గంలో సాధారణ భక్తుల తరహాలోనే శ్రీవారి దర్శనాని వెళ్తూ టీటీడీ ఏర్పాట్లు, భక్తుల ఇబ్బందులు చంద్రబాబు స్వయంగా పరిశీలిస్తారు.
