క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలో అన్న‌దాన కేంద్రం

జూలై 15 లోపు ఏర్పాటు చేయాల‌ని ఆదేశం

hellotelugu-Indrakeeladri

విజ‌య‌వాడ : ఏపీ దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ క‌మిష‌న‌ర్ కె. రామచంద్ర మోహన్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలో నిత్య అన్న‌దానం కోసం ఏర్పాట్లు చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. పండుగల సమయంలో యాత్రికులకు సేవలందించడాన్ని సులభతరం చేయడం ఈ కొత్త అన్నదానం, ప్రసాదం తయారీ కేంద్రాల లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు క‌మిష‌న‌ర్. ఇదిలా ఉండ‌గా ఈ త‌యారీ కేంద్రాల‌ను జూలై 15 లోపు ప్రారంభించేలా చూడాల‌ని ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన భక్తుల సౌకర్యాల మెరుగుదల కోసం చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ఆలయ చైర్మన్, కార్యనిర్వహణాధికారి శ్రీ‌ను నాయ‌క్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.

ముందుగా ఆయన పునరుద్ధరించిన ఆశీర్వచన మండపంతో పాటు పూర్తయిన ఫ్లోరింగ్ పనుల నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కొండ దిగువన నిర్మాణ దశలో ఉన్న కొత్త అన్నదాన భవనం , ప్రసాదం తయారీ కేంద్రం (పోటు) పనులను క‌మిష‌న‌ర్ రామ‌చంద్ర మోహ‌న్ సమీక్షించారు. రద్దీ నియంత్రణ , భక్తుల సౌకర్యార్థం కొన్ని మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. జూలై 15 లోపు ఈ సౌకర్యాలను ప్రారంభించాలని స్పష్టం చేస్తూ, ప్రారంభోత్సవ తేదీ , ముహూర్తాన్ని ఖరారు చేయడానికి వేద కమిటీని సంప్రదించాలని ఆలయ ఈవోను ఆయన ఆదేశించారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. రాబోయే ఆషాఢ సారె సమర్పణ , శాకంబరి ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు.

పండుగలకు ముందే ఈ కొత్త సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల భక్తులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపాదిత క్యూ కాంప్లెక్స్ కోసం భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన ఆయన, ఆధునిక మౌలిక సదుపాయాలు, సౌకర్యాలతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. సీనా నాయక్, బోర్డు సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version