తిరుపతి : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జూన్ 23న వైభవంగా జరగనుంది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా చేపట్టనున్నారు.
మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, అర్చన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
జూన్ 25న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 28న ఆర్జిత కల్యాణోత్సవం, జూన్ 29న గరుడసేవ, జూలై 2న రథోత్సవం, జూలై 3న చక్రస్నానం, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. ఈ దివ్యోత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.
