అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎఎస్. సవిత సంచలన ప్రకటన చేశారు. బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరహాలో అన్ని ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ లో కూడా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్తను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ప్రతి నియోజక వర్గంలోనూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయుల ఆర్థిక వృద్ధికి ఆయా కార్పొరేషన్ల ఆధ్వర్యంలో చేపట్టాలని సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో చర్చించారు.
ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఆయా కుల సంఘాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కాపు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఇతర ఈబీసీ కులాల సాధికారితకు పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈడబ్ల్యూఎస్ కులాల అభ్యున్నతే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యమన్నారు. వివిధ పథకాల అమలులో భాగంగా 2025-26 బడ్జెట్ లో ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం రూ.10,608.61 కోట్లు కేటాయించిందన్నారు. వాటిలో ఈబీసీలకు రూ. 915.28 కోట్లు, కమ్మ కార్పొరేషన్ కు రూ.1,711.42 కోట్లు, రెడ్డి కార్పొరేషన్ కు రూ.1,946.36 కోట్లు, క్షత్రియ కార్పొరేషన్ కు రూ.260.20 కోట్లు, కాపు కార్పొరేషన్ కు రూ.4,884.83 కోట్లు, ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.545.05 కోట్లు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.345.46 కోట్లు కేటాయించామన్నారు.
