TTD : తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) సంచలన ప్రకటన చేసింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే పనులు ఎవరు చేసినా, ఎంతటి వారైనా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు ఆలయ కార్య నిర్వహణ అధికారి జె. శ్యామల రావు. ఇందుకు సంబంధించి టీటీడీ (TTD) అధికారికంగా ప్రకటన జారీ చేసింది.
TTD Strong Warning
తిరుమల శ్రీవారి ఆలయం ముందు , మాడ వీధుల్లో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు ఈవో. అంతే కాకుండా పవిత్రతకు భంగం కలిగించేలా వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందని స్పష్టం చేశారు. తిరుమల లాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర ,అసభ్యకర చర్యలు సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు శ్యామల రావు. తిరుమల క్షేత్రం భక్తి, ఆరాధనలకు నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచు కోవాలని అన్నారు. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలని పేర్కొన్నారు ఈవో. శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు ఈవో.
టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వీడియోలు చిత్రీకరించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. తిరుమల పవిత్రతను భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. తిరుమలలో అసభ్యకర వీడియోలు, వెకిలి చేష్టలతో రీల్స్ చేయకుండా తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను కాపాడడంలో సహకరించాలని భక్తులను కోరారు.
Also Read : Dhwajasthambha Renovation Interesting : లక్ష్మీ నరసింహ ఆలయంలో ధ్వజ స్తంభ జీర్ణోద్దరణ
